అన్నదాతకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. పంటలు సాగుచేద్దామని.. విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయానికి వెళ్తే అవి దొరకని పరిస్థితి. కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రభుత్వం అందించే రాయితీ వరి వంగడాలు అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో దొరికే విత్తనాలపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వంగడాలు మొలకలు రావటంలేదని... కొన్నింటిలో వేరువేరు రకాలు వస్తున్నాయని అంటున్నారు. మోపిదేవి మండలంలో సుమారు 12 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేస్తారు. రైతులు ఎక్కువగా ఎంటీయూ 1061 రకాన్ని 2వేల ఎకరాల్లో, బీపీటీ 5204 రకాన్ని 10 వేల ఎకరాల్లో సాగుచేస్తారు. ఈ రెండు రకాల విత్తనాలు అయిపోయి దాదాపు 20 రోజులైంది. వారం రోజుల నుంచి కేఈబీ కాలువకు నీరు విడుదల చేశారు. మండలంలోనూ భారీవర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలో రైతులు పంటల సాగుకు తయారవుతున్నారు. రైతులకు మాత్రం నిరాశే మిగులుతోంది. అన్ని మండలాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు దొరకటంలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వర్షాలు కురిసినా... అధికారులు ఇప్పటికైనా స్పందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి మండలంలోనే ఆన్లైన్ విధానం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి