కృష్ణమ్మకు వరదనీటి పోటు కొనసాగుతోంది. తెలంగాణ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గంటగంటకూ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నీరంతా కృష్ణాలో కలుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బ్యారేజీలో పులిచింతల నుంచి వస్తున్న నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది.
అయితే మున్నేరు నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో వరదనీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న ముసురువాన తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 15.3 నీటిమట్టాన్ని ఉంచుతూ దిగువకు నీటిని వదులుతున్నారు. లక్షా 11వేల 656 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. లక్షా 11వేల 524 క్యూసెక్కుల నీటిని దిగువకు కాలువల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు.
భారీ వర్షాలు, వరదను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మూడు రోజులుగా సుమారు 5 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటచేలు నీట మునిగాయి. కొన్నిచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
విజయవాడ నగరంతో పాటు.. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు తదితర మండలాల్లో ముసురు వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల అధిక వర్షపాతం నమోదైంది. వత్సవాయి మండలం లింగాల వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 14 అడుగులకు చేరింది. పెనుగంచిప్రోలు వంతెన తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. అనాసాగరం మునేటి కాలువకు గండ్లు పడటంతో పంట పొలాలు నీట మునిగాయి.
నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు ప్రవహిస్తున్నాయి. దీంతో వీరులపాడు, నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల్లో భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరే అవకాశం ఉండటంతో నదీ పరివాహాక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందస్తుగా సహాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
ఇదీ చూడండి