రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ సామర్థ్యం గల కేంద్రాన్ని.. గన్నవరంలో ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించి.. టీకా పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. హైదరాబాదు, చెన్నై నుంచి గన్నవరం విమానాశ్రయానికి.. అక్కడి నుంచి కర్నూలు, కడప, గుంటూరు, విశాఖలోని ప్రాంతీయ నిల్వ కేంద్రాలకు వ్యాక్సిన్ చేరవేస్తామన్నారు. అన్ని జిల్లాలకు టీకా రవాణా కోసం 19 ప్రత్యేక వాహనాలు సిద్ధంగా చేసినట్లు వెల్లడించారు. ప్రతి వాహనంలో 2 - 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేట్లు చర్యలు తీసుకున్నామన్నారు. గన్నవరం రాష్ట్రస్థాయి నిల్వ కేంద్రంలో 3 వ్యాక్సిన్ కూలర్లు, 3 ఫ్రీజర్లు అందుబాటులో ఉంచామన్నారు. వీటికి అదనంగా మైనెస్ 14 డిగ్రీల్లో వ్యాక్సిన్ భద్రపరచేందుకు వీలుగా మరో వ్యాక్సిన్ కూలర్, ఫ్రీజర్ ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి జిల్లాలో 100 నుంచి 150 కోల్డ్ చైన్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. కృష్ణాజిల్లాకు సంబంధించి 3.5 లక్షల కొవిడ్ టీకా డోసులను మచిలీపట్నంలో నిల్వ చేస్తున్నామన్నారు. అక్కడకు 6,525 లీటర్లు వ్యాక్సిన్ రవాణా చేస్తామని.. ఒక్కో లీటరుకు 200 డోసులు పరిమాణం ఉంటుందన్నారు. టీకా రవాణా, పంపిణీకి సంబంధించి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, సిబ్బందిని నియమించామన్నారు. వ్యాక్సిన్ పంపిణీ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతుందని భావించి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. తొలివిడతలో ఆరోగ్యకార్యకర్తలకు, అనంతరం కరోనా కట్టడికి ముందు వరుసలో పోరాడిన పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి, తదుపరి రెవెన్యూ ఉద్యోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్లు పైబడిన వారికి టీకా అందిస్తామని పేర్కొన్నారు. టీకా వేయడం ప్రారంభించిన రోజు నుంచే.. ఆయా కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు అవసరమైన ఐస్ ప్యాక్స్, కోల్డ్ బాక్స్‌లు సిద్ధం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 227 కొవిడ్ కేసులు, ఒకరు మృతి