సౌరశక్తి వినియోగంలో విజయవాడ డివిజన్ ప్రథమస్థానంలో ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 40,01,047 యనిట్ల ద్వారా రూ.3.58 కోట్లు ఆదా అయ్యాయి. దేశంలో తొలి సారి విజయవాడ రైల్వేస్టేషన్‌లో 4, 5 ప్లాట్‌ఫారాల్లో ఏర్పాటు చేసిన అధునాతన సౌర వ్యవస్థ ద్వారా విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గింది. ఇక్కడ 65 కేడబ్ల్యూపీ కెపాసిటీతో సుమారు రూ.60 లక్షల వ్యయంతో 33 మీటర్ల పొడవులో బిల్డింగ్ ఇంట్రిగ్రేటెడ్ వోల్టిక్(బీఐవీవీ) సౌర విద్యుత్తు పలకలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి వినియోగంలోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న సౌర పలకలను భవన పైకప్పుపై ఏర్పాటు చేస్తుండగా, తొలి సారి ఆ పలకలే పైకప్పుగా, విద్యుత్తు ఉత్పాదకాలుగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం స్టేషన్‌కు రోజుకు 1500 కేడబ్ల్యూహెచ్ విద్యుత్తు అవసరమవుతుంది. తాజా అత్యాధునిక సౌరశక్తి పలకల ఏర్పాటు ద్వారా రోజుకు 260కేడబ్ల్యూహెచ్ విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. వీటిని ఏర్పాటు చేయడానికి అవుతున్న ఖర్చు ఏడాదిలోగా తిరిగి రానుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ద్వారా ఏటా లక్షల రూపాయలు ఆదా అవుతాయి. డివిజన్‌లోని వివిధ స్టేషన్లలోనూ సౌరశక్తి యనిట్లు ఏర్పాటుచేశారు.
రైల్వే జీఎం ప్రశంసలు:
సౌరశక్తి ద్వారా కోట్లాది రూపాయిలు ఆదా చేసినందుకు విజయవాడ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్(నిర్వహణ) వి.వెంకటరమణ రైల్వే బోర్డు నుంచి గత ఏడాది పురస్కారం అందుకున్నారు. తాజాగా గురువారం రైల్వే జీఎం గజానన్‌మల్యాతో నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌లో డీఈఈని ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి : పండుగల రద్దీ దృష్ట్యా...ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు