దుర్గామాత ఆవహిస్తోందని ప్రతీతి
పండగ రోజుల్లో మనిషికి శక్తివేషం వేసి వెదురు కర్రలతో తయారుచేసిన దుర్గామాత శక్తి పటానికి కాగితాలు అంటించి దుర్గామాత బొమ్మవేసి రంగులు అద్ది, అతని వీపునకు కడతారు. శక్తిపటాలు కట్టుకున్న వ్యక్తి పురవీధుల్లో ఊరేగుతుండగా డప్పుమోతలతో నృత్యం చేస్తూ భక్తులు అతనిని అనుసరిస్తుంటారు. శక్తిపటం కట్టుకున్న వ్యక్తిని దుర్గామాత ఆవహిస్తుందని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. అలా ఊరేగుతున్న శక్తిపటాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నల్లని దుస్తులతో ఒక చేతిలో చురకత్తి, రెండో చేతిలో ఆరడగుల శక్తిపటాన్ని భుజానకెత్తుకుని నిర్వహించే ప్రదర్శన భక్తిభావాలను చాటుతుంది. ఒక వైపు ఆంజనేయస్వామి మరోవైపు కాళికామాత చిత్రాలను మనోహరంగా రూపొందించిన పటం చూపరులకు కనువిందు చేస్తుంది.
సకుటుంబ సపరివారంగా వీక్షణం
గతంలో మచిలీపట్నంలోని శక్తిగుడి, గొడుగుపేట గాయత్రిమాత ఆలయం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు జరిగేవి. ఇప్పుడు ఇతర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు శక్తిపటాలు ఎత్తుకుంటున్నారు. రుద్రభూమిలో తెల్లవారు జామున పూజలు చేసి శక్తిపటాన్ని ఎత్తుకునే వ్యక్తి ఉపవాస దీక్షను స్వీకరిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులతో పాటు వారి బంధువులు, భక్తులు అధికసంఖ్యలో పట్టణానికి తరలివస్తుంటారు.
కోనేరు సెంటర్లో ప్రత్యేక ప్రదర్శన
ముఖానికి కాళికామాత ముఖచిత్రాన్ని కరాళంగా ధరిస్తారు. ఉదయం ఉపవాస దీక్షతో మొదలయ్యే ప్రదర్శన సాయంత్రం వరకూ కొనసాగుతుంది. శక్తిపటాన్ని ధరించడం వలన కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. విజయదశమి నాటి రాత్రి ఆయా ప్రాంతాలనుంచి శక్తిపటాలు ఊరేగింపుగా బయలుదేరి కోనేరు సెంటర్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తారు. తెల్లవారుజాము వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. శక్తిపటాలు కోనేరు సెంటర్కు చేరుకోవడంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చదవండి :