చోడవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన కిరణ్‌కుమార్.. ఈనెల 3వ తేదీన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి కారులో మచిలీపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు అవనిగడ్డలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. తిరిగి 10 గంటలకు పెనుమాక బయలుదేరాడు. కరకట్ట మార్గంలో ప్రయాణిస్తూ.. చోడవరం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తోన్న మరో కారును తప్పించబోయి వీరి వాహనం అదుపు తప్పి.. కాల్వ వైపు దూసుకుపోయింది. కారు ముందు సీట్లో భార్య దుర్గా మహాలక్ష్మి కూర్చోగా.. ఈమె ఒళ్లో వీరి రెండో కుమారుడు 11 నెలల తక్షిత్ ఉన్నాడు. వెనుక సీట్లో పెద్ద కుమారుడు శ్రీమహంత్ నిద్రపోతున్నాడు. కారు కాల్వలోకి పడిపోగానే కిరణ్ కుమార్ వెంటనే అద్దాలు పగలగొట్టి చిన్నారి తక్షిత్ను తీసుకొని ఒడ్డుకు చేర్చాడు.
భార్య, పెద్ద కుమారుణ్ని రక్షించేందుకు తిరిగి కాల్వలోకి దిగే ప్రయత్నం చేయగా.. ఒడ్డుకు చేర్చిన చిన్నారి తిరిగి కాల్వలోకి జారిపోయాడు. వెంటనే కిరణ్ కుమార్ ఈ చిన్నారిని కట్టపైకి చేర్చాడు. ఈ ప్రయత్నంలో భార్య, పెద్ద కుమారుణ్ని రక్షించేందుకు సమయం చాలలేదు. కరకట్టపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి భార్య, పెద్ద కుమారుణ్ని ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. కళ్లెదుటే భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోవడం కిరణ్‌కుమార్‌ను షాక్‌కు గురి చేసింది. వారి మృతదేహాలను చూసి మృత్యుంజయుడైన చిన్నారిని హత్తుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది. సమాచారం అందుకున్న పెనమలూరు సీఐ సత్యనారాయణ, ఎస్సై వెంకటేశ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్వలో మునిగిపోయిన కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..
సిబ్బంది నిర్లక్ష్యం.. రుయా ఆస్పత్రి నుంచి కరోనా రోగి మాయం..!