ETV Bharat / state

విద్యా విధానంలో భారీ మార్పులు - ఏపీ విద్యా విధానాల్లో భారీ మార్పులు

దేశవ్యాప్తంగా విద్యావిధానంలో భారీమార్పులు.. ఉన్నత విద్యా కోర్సుల్లోనూ అలాంటి అవకాశం.. ఇష్టమైనవి చదువుకునే వెసులుబాటు.. 12వ తరగతి వరకూ విద్యా హక్కు.. విద్యాశాఖగా హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ.. కొత్త విద్యావిధానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం.

schools
schools
author img

By

Published : Jul 30, 2020, 4:44 AM IST

దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం... ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు. కొత్త విధానంలో విద్యను సరళతరంగా మార్చారు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను చదువుకొనే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం భారంగా మారిన పాఠ్యాంశాలను తగ్గించి, విద్యార్థులు తమలో అంతర్గతంగా దాగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించుకొనే అవకాశం ఇవ్వబోతున్నారు. పాఠశాల విద్య పూర్తిచేసుకొని బయటికెళ్లేనాటికి కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యమైనా విద్యార్థి సాధించేలా మార్పులు చేస్తున్నారు. అయిదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నిబంధన విధించారు. వీలైతే 8వ తరగతి వరకు కానీ, అంతకు మించిన తరగతుల వరకు కానీ మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ఉత్తమమని ఈ కొత్త విధానంలో రాష్ట్రాలకు నిర్దేశించారు. ఇకమీదట మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా మార్చడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

సకల విద్యా ప్రాప్తిరస్తు..

నూతన విద్యా విధానంలో విద్యార్థుల సమగ్ర వికాసానికే పెద్దపీట వేశారు. అదే సమయంలో భారమూ తగ్గించే ప్రయత్నం చేశారు. మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయస్థాయిని అందుకునేలా మార్పులకు శ్రీకారం చుట్టారు.

జాతీయ విద్యా విధానాన్ని తొలుత 1968లో, తర్వాత 1986లో రూపొందించారు. దానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 1986 విధానమే 34 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. దాని స్థానంలో కొత్త విధానం రూపొందించడానికి మోదీ ప్రభుత్వం 2016 మే 27న టీఎస్‌ఆర్‌ సుబ్రహ్మణ్యం కమిటీ, 2019 మే 31న కె.కస్తూరిరంగన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కస్తూరిరంగన్‌ కమిటీ నివేదికను ఇప్పుడు ఆమోదించింది.

కొత్తగా 3 కోట్ల సీట్లు

2035 నాటికి ‘స్థూల నమోదు నిష్పత్తి’ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో)ని ఇప్పుడున్న 26.3% నుంచి 50%కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఉన్నత విద్యా సంస్థల్లో కొత్తగా 3 కోట్ల సీట్లు వస్తాయి.

* అన్ని కోర్సుల్లో హోలిస్టిక్‌, మల్టీ డిసిప్లినరీ విద్యా విధానాన్ని తీసుకొస్తారు. సబ్జెక్టులను సరళంగా మార్చనున్నారు.

* యూజీ కోర్సుల్లో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణ (మల్టిపుల్‌ ఎంట్రీ/ఎగ్జిట్‌) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడున్న విధానంలో 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆరు సెమిస్టర్ల తర్వాత చదువుకోలేని పరిస్థితి వస్తే పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఒక ఏడాది తర్వాత విద్యార్థి మానేస్తే సర్టిఫికెట్‌ ఇస్తారు. రెండేళ్ల తర్వాత మానేస్తే డిప్లొమా, 3-4 ఏళ్ల తర్వాత డిగ్రీ అందిస్తారు.

* ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న వారికి మూడేళ్ల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్లాలనుకున్నవారికి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి ఓ ఏడాది పీజీ కోర్సు ఉంటుంది. దాని తర్వాత ఎంఫిల్‌ చేయాల్సిన అవసరం లేకుండానే పీహెచ్‌డీకి వెళ్లొచ్చు. మాస్టర్స్‌తో కలిపి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ అమలు చేస్తారు. ఎంఫిల్‌ను తొలగిస్తారు.

నిధుల పెంపుతో చేయూత

సాధ్యమైనంత త్వరగా జీడీపీలో 6% నిధులు విద్యారంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 4.4% నిధులు ఇస్తున్నాయి.

* అమెరికాలో నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఉన్నట్లుగా దేశంలో నేషనల్‌ రీసెర్చి ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తారు. శాస్త్ర, సామాజిక శాస్త్రాల విభాగాల్లో చేపట్టే భారీ పరిశోధన కార్యక్రమాలకు దీని ద్వారా ఆర్థిక చేయూత అందిస్తారు. పరిశోధన, నవ్యావిష్కరణలు, పేటెంటింగ్‌లో ఈ ఫౌండేషన్‌ ద్వారా సాయం చేస్తారు.

* విద్యా రంగాన్ని అంతర్జాతీయీకరణ చేస్తారు. విదేశీ విద్యాసంస్థలు ఇక్కడ ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకొనేలా ప్రోత్సహిస్తారు.

తెలుగులోనూ ఇ-కంటెంట్‌

* ఇప్పటి వరకు ఇంగ్లిష్‌, హిందీలకే పరిమితమైన ఈ-కంటెంట్‌ను తెలుగుతోపాటు 8 భారతీయ భాషల్లో అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తారు.

* అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో వర్చువల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తారు.

* విద్యా రంగంలో సాంకేతిక వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడానికి ప్రైవేటు, ప్రభుత్వ, సాంకేతిక రంగాన్ని ఒకే వేదిక మీదికి తెస్తూ ‘నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఫోరం’ ఏర్పాటు చేస్తారు.

పాఠశాల విద్యా విధానంలో...

పూర్వ ప్రాథమిక విద్యను (ప్రీ ప్రైమరీ) సార్వత్రీకరిస్తారు. దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేస్తుంది. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఆటలు, కార్యకలాపాల ఆధారమైన సరళ పాఠ్యాంశాలను అమల్లోకి తెస్తారు.

* 1 నుంచి 3 తరగతులు చదివే 6-9 ఏళ్ల విద్యార్థులు ప్రాథమికమైన అక్షరాలు, అంకెలు సరిగా గుర్తుపట్టి చదివేలా, లెక్కలు చేసేలా తీర్చిదిద్దేందుకు ఒక నేషనల్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక దశలో విద్యార్థులు నిర్దేశిత పాఠ్యాంశాలను సరిగా నేర్చుకొనేలా తీర్చిదిద్దడమే ఈ మిషన్‌ ప్రధాన ఉద్దేశం.

* బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇప్పుడున్న 8, 10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు.

* ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించనున్నారు. ఏటా ఒకసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్ట్‌లో విద్యార్థులకు రెండు స్థాయిలు ఉంటాయి. బట్టీ పట్టే సామర్థ్యాన్ని కాకుండా వారిలోని తెలివితేటలను పరీక్షించేలా వీటిని తీర్చిదిద్దుతారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేలా వాటిని నిర్వహిస్తారు.

పురోగతి నివేదికలూ మారిపోతాయి

విద్యార్థుల పురోగతి నివేదిక (ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌)లో మార్పులు తెస్తారు. ఇప్పటివరకు విద్యార్థి మార్కులతోపాటు, వారి ప్రవర్తన గురించి టీచర్లు రాసే అభిప్రాయాలు మాత్రమే అందులో ఉంటున్నాయి. ఇకమీదట విద్యార్థి స్వీయ అభిప్రాయంతోపాటు, వారి సహాధ్యాయి, టీచర్ల అభిప్రాయాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఏటా విద్యార్థులు నేర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాల (లైఫ్‌స్కిల్స్‌) గురించి తల్లిదండ్రులతో మాట్లాడి నివేదిక రూపొందిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయటికెళ్లే సమయానికి వారు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారన్నది దానిలో నిక్షిప్తం చేస్తారు.

ఏ భాషనూ బలవంతంగా రుద్దవద్దు

త్రిభాషా సూత్రంతో సహా అన్ని స్థాయి తరగతుల్లో సంస్కృతం ఉండేలా చూడాలని, దాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలిపెట్టాలని కొత్త విధానం స్పష్టం చేసింది. ఇతర భారతీయ ప్రాచీన భాషలను ఎంచుకొనే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించాలని పేర్కొంది. విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దొద్దని స్పష్టం చేసింది. భారతీయ భాషలను విద్యార్థులు చాలా ఆనందంగా నేర్చుకొనే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొంది. పలు విదేశీ భాషలు నేర్చుకోవడానికీ వీలు కల్పించాలని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా ఇండియన్‌ సైన్‌ లాగ్వేంజ్‌ను ప్రామాణీకరించాలని పేర్కొంది. బధిర పిల్లల కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో పాఠ్యాంశాలు అభివృద్ధి చేయాలంది. భారతీయ భాషల సంరక్షణతోపాటు, వాటి వినియోగాన్ని పెంచి, వాటికి గతిశీలతను తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లు నూతన విద్యా విధానం పేర్కొంది.

10+2+3 బదులు 5+3+3+4

పాఠ్యక్రమాల నిర్మాణాన్ని పూర్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం 10+2+3 విధానం ఉంది. పదోతరగతి వరకు విద్యార్థులకు దశలవారీ పాఠ్యాంశాలు ఉంటాయి. ప్లస్‌టూకి వెళ్లినవారికి ప్రత్యేక సబ్జెక్ట్‌లు వస్తాయి. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ల పాఠ్యక్రమ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో 3 నుంచి 6 ఏళ్లవరకు పిల్లలకు ప్లేస్కూల్‌ ఉంటుంది. వారికి ఎనిమిదేళ్లు వచ్చేంతవరకూ ఆటలు, ఇతర కార్యకలాపాలు, అనుభవ పూర్వకంగా నేర్చుకోవడం వంటివి ఉంటాయి. 3 నుంచి 8 ఏళ్ల లోపు వారు ఫౌండేషన్‌ స్టేజిలో, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ స్కూలింగ్‌లో, 11-14 ఏళ్ల వారు మిడిల్‌ స్కూల్‌లో, 14-18 ఏళ్లవారు సెకెండరీ స్థాయిలో ఉంటారు. 6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఏ కూర్పులోనైనా సబెక్టులు తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్‌తో పాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కానీ, ఆహార తయారీ కోర్సులు కానీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు కానీ ఎంచుకోవచ్చు. విద్యాహక్కును 1 నుంచి 8వ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రీ స్కూల్‌ నుంచి 12వ తరగతి వరకు విస్తరింపజేస్తారు.

డిజిటల్‌ లాకర్లలో పాత క్రెడిట్లు

ఒకటి రెండు సంవత్సరాలు చదివిన తర్వాత విద్యార్థులు ఏదైనా కారణాలతో చదువు మానేసినా, మళ్లీ తనకు వీలైన సమయంలో దానికి కొనసాగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అప్పటివరకు ఆ విద్యార్థి చదివిన ఒకటి, రెండు సంవత్సరాలకు సంబంధించిన క్రెడిట్స్‌.. డిజిటల్‌ లాకర్స్‌లో భద్రంగా ఉంటాయి. విద్యార్థి మళ్లీ తొలి సంవత్సరం నుంచి చదవాల్సిన అవసరం లేదు. అప్పటివరకు తన డిజిటల్‌ లాకర్‌లో ఉన్న క్రెడిట్స్‌ను ఉపయోగించుకొని మిగిలిన సంవత్సరాలు పూర్తిచేయొచ్చు.

ప్రాథమిక స్థాయి నుంచే సైన్స్‌పై ఆసక్తి

సైన్స్‌, లెక్కలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే వారిని ప్రోత్సహిస్తారు. 6వ తరగతి నుంచి విద్యార్థులకు కోడింగ్‌ నేర్పిస్తారు. ప్రస్తుతం విద్యార్థులు సంగీతం, కళలు, ఆటలు, ఇతర ఆసక్తికర అంశాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల సైన్స్‌పై ఆసక్తి, సమస్యలను పరిష్కరించే తత్వం, సంక్లిష్టమైన ఆలోచనా విధానం వారిలో తగ్గిపోతోంది. దీని దృష్ట్యా- ఇప్పుడున్న పాఠ్యాంశాలను అత్యవసర అంశాల వరకే పరిమితం చేసి మిగతా వాటిని తగ్గిస్తారు. వృత్తి విద్యా కోర్సులను 6వ తరగతినుంచే ప్రారంభిస్తారు. ఇందులో ఇంటర్న్‌షిప్‌ సైతం ఉంటుంది.

యూజీసీ, ఏఐసీటీఈ ఉండవు

ప్రస్తుతం విద్యావ్యవస్థ నియంత్రణ కోసం యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వంటి వ్యవస్థలున్నాయి. వీటన్నింటినీ విలీనం చేసి మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

* అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే నిబంధనలు అమలుచేస్తారు.

ఈ సంస్కరణల కోసం విద్యారంగం చాలాకాలంగా ఎదురుచూస్తోంది. రాబోయే రోజుల్లో లక్షల మంది జీవితాలను ఈ విధానం మార్చబోతోంది. విద్యతో మన దేశం మరింతగా కాంతులీనాలి, సుసంపన్నత సాధించాలి. -ప్రధాని నరేంద్రమోదీ

సరికొత్త సంస్కరణలు

  • మానేసినా గుర్తింపు..

ఇప్పటిలాగా... గణితం ఎంచుకున్నవారు చరిత్రపై ఆసక్తి ఉంటే వదలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే... డిగ్రీలో ఓసారి చేరి, ఇష్టం లేకున్నా మూడేళ్ళు తప్పనిసరిగా అదే చదవాల్సిన అవసరమూ లేదు. తమకు ఇష్టం వచ్చిన కాంబినేషన్లలో సబ్జెక్ట్‌లు తీసుకోవచ్చు.... ఇష్టం వచ్చినప్పుడు ఆ కోర్సు నుంచి వైదొలగవచ్చు. అప్పటి వరకు గుర్తింపు ఇస్తారు. మళ్లీ కుదిరినప్పుడు కొనసాగించవచ్చు. పరిశోధన చేయాలనుకుంటే నాలుగో ఏడాది వరకు ఉండి చేయొచ్చు కూడా! అలా విద్యార్థికి వెసులుబాటు ఉండేలా సబ్జెక్ట్‌ల ఎంపికలో, కోర్సు గడువులో (3-4 ఏళ్ళు) మార్పులు తెచ్చారు. ఇంజినీరింగ్‌ వాళ్ళు ఆర్ట్స్‌ చదివేలా... ఆర్ట్స్‌ ఎంచుకున్నవాళ్ళు సైన్సూ చదివేలా ఏర్పాటు చేస్తారు.

*తొలి సంవత్సరం: సర్టిఫికెట్‌
* రెండో ఏడాది: అడ్వాన్స్‌ డిప్లమో
* మూడో ఏడాది: బ్యాచిలర్‌ డిగ్రీ
* నాలుగో ఏడాది: పరిశోధనతో కూడిన బ్యాచిలర్‌ డిగ్రీ ఇస్తారు.

టీచర్‌ కావాలంటే ఇక....

ఉపాధ్యాయ సామర్థ్యాలపై కొత్త విధానంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఉపాధ్యాయుల నియామకాలను ఇకమీదట పారదర్శక-పటిష్ఠ పద్ధతిలో చేపడతారు.

* బోధన పట్ల నిబద్ధత, తపన ఉన్నవారు

* అకడమిక్‌గా, బోధనాపరంగా, పరిశోధనపరంగా, ప్రజాసేవ పట్ల అంకితభావాలను కూడా పరీక్షించి తీసుకుంటారు.

* వారి సామర్థ్యాల్ని మదించిన తర్వాతే... పదోన్నతులుంటాయి.

* ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రమాణాలను రూపొందిస్తారు.

ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌ మాతృభాషలో?

భారతీయ భాషలకు, మాతృభాషలకు కొత్త విద్యావిధానం పెద్దపీట వేస్తోంది. కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష, భారతీయ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌, ఇంటర్‌ప్రెటేషన్‌ (ఐఐటీఐ), పాళి, పెర్షియన్‌, పాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి... అన్ని ఉన్నతవిద్యా సంస్థల్లో వీటి విభాగాలుండేలా చూస్తారు. ఉన్నత విద్యలోని అనేక కోర్సులను మాతృభాషల్లో, స్థానిక భాషల్లో నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారు.

ఏ భాషనూ రుద్ద కూడదు...

స్కూల్‌ నుంచి మొదలెడితే... ఉన్నత విద్య వరకు ప్రతిదశలోనూ సంస్కృతం ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంటుంది. మిగిలిన భాషలు కూడా తీసుకోవచ్చు. ఏ భాషనూ విద్యార్థిపై బలవంతంగా రుద్దరు. సెకండరీ స్థాయిలో విదేశీవిద్యల్ని కూడా పరిచయం చేస్తారు.

3, 5, 8లోనే పరీక్షలు..

3, 5, 8 తరగతుల్లోనే స్కూల్‌ పరీక్షలుంటాయి. అవి కూడా నిర్దేశిత బోర్డు ద్వారా నిర్వహిస్తారు. 10, 12 తరగతులకు యధావిధంగానే పరీక్షలుంటాయిగాని... వాటి తీరు మారుతుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా... వారి జ్ఞానాన్ని, విశ్లేషణలను ఇతరత్రా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం పరాఖ్‌ (విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, విశ్లేషించే సంస్థ)ను ఏర్పాటు చేస్తున్నారు. ఆరో తరగతి తర్వాతి నుంచే వృత్తివిద్యలను అందరికీ పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఏదైనా ఓ వృత్తివిద్యలో ప్రవేశం ఉంటుంది.

ఎంబీబీఎస్‌ చేస్తూ కోడింగూ...

ఇప్పటిదాకా వృత్తివిద్యా కోర్సులది పూర్తిగా ప్రత్యేక దారి. సాంకేతిక విద్య, లా, వ్యవసాయ విద్య, వైద్యం, ఆరోగ్యం... ఇలా వేటికవే విడివిడిగా సాగుతున్నాయి. వీటన్నింటినీ ఉన్నతవిద్యలో భాగం చేసి... మల్టీడిసిప్లినరీగా వెసులుబాటు కల్పిస్తారు. అంటే... ఎంబీబీఎస్‌ చేస్తూనే కావాలంటే కోడింగ్‌ కూడా నేర్చుకోవచ్చు.

అమలుపైనే సందేహం

నూతన విద్యా విధానంలో ఆశయాలు, ఉద్దేశాలు బాగున్నాయి. కాకపోతే వాటిని సాధించేందుకు కార్యాచరణ ఏమిటన్నది ప్రస్తావించలేదు. లక్ష్యం నెరవేరాలంటే బడ్జెట్‌ కూడా అవసరమే. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 26 శాతం నిధులు కేటాయించడం వల్లే ఇప్పుడు అక్కడ పాఠశాలల్లో సీట్ల కోసం డిమాండ్‌ పెరిగింది. అంత బడ్జెట్‌ను కేంద్రం, రాష్ట్రాలు కేటాయించగలవా? అన్నది ప్రశ్నార్థకం. ఉన్నత విద్యను కూడా మాతృభాష లేదా స్థానిక భాషలో బోధించడం మాత్రం మంచిది కాదు.-ఆచార్య ఎస్‌.సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యులు, ఓయూ

నిధులు భారీగా అవసరం

నూతన విద్యా విధానంలో చాలా మంచి అంశాలున్నాయి. అది అమలైతే విద్యావ్యవస్థలో పలు మార్పులు రావడం ఖాయం. లక్ష్యాలు చేరుకోవాలన్నా...విజయవంతం కావాలన్నా భారీగా నిధులు అవసరం. కాకపోతే విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున అమలులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా కీలకం. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు లాభాలు గడించకుండా ప్రభుత్వాలు నియంత్రించడం ఆచరణలో సాధ్యమేనా అన్నది వేచిచూడాలి.-నాగప్రసాద్‌ తుమ్మల,పాలకమండలి సభ్యుడు, ఫిక్కీ అరైజ్‌

ఏకపక్ష నిర్ణయం

కేంద్ర మంత్రివర్గం నూతన విద్యా విధానాన్ని ఏకపక్షంగా ఆమోదించడం సరికాదు. ఆరెస్సెస్‌ ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే మోదీ సర్కారు విధ్వంసకర నిర్ణయానికి ఒడిగట్టింది. అఖిల భారత స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కలిసి మూణ్నెళ్లు అధ్యయనం చేసి ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళికను కేంద్రానికి అందిస్తే.. దాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం.- నారాయణ, సీపీఐ

శుభసూచకం

కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన నూతన విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నా. ఇది శుభసూచకం, రాష్ట్రాలతో కలిసి దీనిని అమలు చేయాలనుకోవడం అభినందనీయం. దేశంలో 50 ఏళ్ల తర్వాత మార్పు వైపు దృష్టి సారించడం ఆశాజనక పరిణామం.- వినోద్‌కుమార్‌, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

నిధుల కేటాయింపులోస్పష్టత ఉండాలి

నూతన విద్యారంగ సిఫారసుల్లో విద్యారంగానికి కేటాయించే నిధులపై స్పష్టత ఉండాలి. రానున్న పదేళ్లలో 20% పెంపును తప్పనిసరి చేయాలి.- కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ ఏపీ

నూతన విధానం భేష్‌

నూతన విద్యావిధానం బాగుంది. పాశ్చాత్య వ్యవస్థలు, పద్ధతులను కాదని.. మన అవసరాలకు తగ్గట్లు విద్యావిధానాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించడం హర్షణీయం. స్థానికతకే పట్టం కట్టాలన్న ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా కొత్త విధానం ఉంది. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించాలన్న ఆలోచన, ప్రపంచీకరణ అవసరాలకు తగ్గట్లు నైపుణ్యాలు నేర్పాలన్న లక్ష్యం సాకారమవ్వాలి.- ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు, మాజీ ఉపకులపతి,ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం

మాతృభాషనుకాపాడుతుంది

మాతృభాషల్ని కాపాడాలని భారత రాజ్యాంగం చెప్పింది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం మాతృ భాషలు మృత భాషలుగా మారకుండా కాపాడుతుంది. ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. అది అందరికీ అర్ధమయ్యేలా తెలుగులోకి అనువదించి పుస్తకరూపంలో తీసుకొస్తున్నాం. - మండలి బుద్ధప్రసాద్‌, అధికారభాషా సంఘం పూర్వ ఛైర్మన్‌

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.