‘ధాన్యరాశుల బంగారుదారులందు కదలివచ్చెను చూడు సంక్రాంతి లక్ష్మి’! మనదేశ వ్యవసాయ సంస్కృతీ సౌందర్యానికి పట్టం కడుతూ, మట్టి సువాసనను పట్టి చూపించే పండుగ ఏదైనా ఉందంటే- అది మకర సంక్రమణమే! నేలతల్లి కన్నపేగుకు కనకాభిషేకం జరిపించే అపురూపమైన పర్వం పేరే సంక్రాంతి. ‘మాటలు ఉమ్మడి కావాలి... కలయికలు అధికం కావాలి... మనసులు ఏకం కావాలి... చిత్తాలు సంకల్పాలు సద్భావాలు సంపూర్ణంగా సంఘటితం కావాలి’ అని రుగ్వేదం ఆకాంక్షించింది. ఆ ఐక్యత, పరిపూర్ణత తెలుగునాట సంక్రాంతి పూట సంభవిస్తుంది. సంపూర్ణ సాంస్కృతిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ‘అమలిన హేమ కోమముల ఆకలి దీర్చెడి యజ్ఞ వాటిగా, అమరెను పంట కళ్లముల ‘అమృతమస్తు’ అన రైతు దేవతల్’ అన్న వేటూరి సుందర రామ్మూర్తి నీరాజనం గమనిస్తే, ఈ పండుగకు కేంద్ర బిందువు ఎవరో తెలుస్తుంది. ‘సంక్రాంతి రమా! జనత ఆశా గేహ సుషమా!’ అన్న సంబోధనలోని ఔచిత్యం బోధపడుతుంది.
మనోహరమైన మంచుతెరలు చలిపొద్దులు గంగిరెద్దులు భోగిమంటలు తలంటులు పిండివంటలు కొత్తపంటలు జడగంటలు పడుచుజంటలు వారి తీపివలపు పంటలు హరిదాసులు గాలిపటాలు పిట్టలదొరలు గొబ్బెమ్మలు భోగిపళ్లు బంతిపూలు పట్టు పరికిణీలు పాశుర పఠనాలు రథంముగ్గులు కోడిపందాలు కనుమతీర్థాలు బొమ్మలకొలువులు... అన్నింటికీ మించి ఇంటి ముంగిట బంగారు ధాన్యరాశులు... ఒక్కటేమిటి? నిండు సంస్కృతికి నిలువుటద్దం, పరమార్థం- సంక్రాంతి పండుగ. దాని ఉనికి- బోసిపోయిన నగరవీధుల్లో కాదు, వాసికెక్కిన పల్లెసీమల్లో!
సంక్రాంతినాటి ఆచారాలు మనకు బోధించేదేమంటే- పశువులు, పక్షులు మానవ పరివారంలో భాగం కావాలని... ఆహారంలో, సంపదలో వాటికీ భాగం పంచాలని... ఆరుగాలం తనతో సమానంగా శ్రమించే పశువుకు మనిషి కృతజ్ఞుడై ఉండాలని! పశువును సముదాయించే వేళ కర్షక జనావళికి కళ్లు తడిగా మెరుస్తాయే- ఆ మెరుపు పేరు సంక్రాంతి! ‘తొలి పండక్కి వెళదాం’ అని పెనిమిటిని ఒప్పించి, పుట్టింటికి రప్పించిన ఇల్లాలి కళ్లలో సంతృప్తి మిలమిలలాడుతుందే- ఆ కళ పేరు సంక్రాంతి! శీతగాలులతో హేమంతం సీమంతం చేసే వేళ ప్రాయం రసవంతం అవుతుంది... ఆ వెచ్చదనం పేరు సంక్రాంతి. నిండుగాదుల్ని చూసి పొంగిపోతూ రైతన్నలు తమ ఇంటి ముంగిట, దేవాలయ ప్రాంగణాల్లోను వడ్ల కంకులను కుచ్చులుగా వేలాడదీస్తారు. ఆ ‘వడ్ల కిరీటాల’పై పిట్టలు మందలు మందలుగా చేరి చేసే వెర్రి సందడి పేరు సంక్రాంతి.
గుమ్మాలకు పూసిన పచ్చి పసుపు పరిమళం, గోడలకు వేసిన గుల్ల సున్నం ఘాటుతో కలిసి గుమ్మం ముందు గొబ్బెమ్మల చుట్టూ పరిభ్రమిస్తుంటే మనకు తెలియకుండానే మనలో ఆనందం పుట్టుకొస్తే- సంక్రాంతి వచ్చినట్లు. అంబరాన్నంటే సామూహిక సంబరానికి ఆత్మీయ వేదిక సిద్ధమైనట్లు. సంక్రాంతి అంటే సప్తవర్ణ శోభిత జీవన స్వప్నలిపి! ఆ జ్వాలతో మన హృదయసీమల్ని జ్యోతిర్మయం చేసుకోగలిగితే- అదీ నిజమైన సంక్రాంతి. సంక్రాంతి అంటే పొలమారిన జ్ఞాపకం, అలలెగసిన మానస సరోవరం. సంక్రాంతి ప్రకృతి పరంగా పల్లెలకు సంక్రమించిన కానుక, నగరాలను ఊరించే కోరిక. పచ్చదనాన్ని శ్వాసించాలని... బాంధవ్యాలను ఆస్వాదించాలని... ప్రకృతిని సేవించాలని... వెరసి కర్పూరంలా తెలియకుండానే కరిగిపోయిన మన బాల్యాన్ని ఒక్కసారి ప్రేమగా తడుముకోవాలని... అందుకూ పల్లెలకు ఈ పరుగులు!
ఇవీ చదవండి