ఇసుక కొరత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం నూతన ఇసుక విధానం తీసుకొచ్చే వరకు.... కలెక్టర్లకు అధికారం అప్పగించడంతో సరఫరాలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగంలో స్తబ్దత ఏర్పడింది. ఈ రంగాన్నే నమ్ముకుని ఉపాధి పొందుతున్న లక్షలాది కుటుంబాల పరిస్థితి రోడ్డున పడ్డట్లయింది. శ్రీకాకుళం, విజయనగరం సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూలీలుగా పనిచేసేందుకు విజయవాడ వలస వచ్చిన అనేకమంది... పనుల్లేక పూట గడవని స్థితిలో అల్లాడుతున్నారు. మరింత కాలం ఇదే పరిస్థితి కొనసాగితే తట్టుకోలేమని... కష్టాలు త్వరగా తీర్చాలని వేడుకుంటున్నారు.
సరఫరాలో నెలకొన్న అనిశ్చితితో ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంతకుముందు 10 నుంచి 12 వేల మధ్య ఉన్న లారీ ఇసుక లోడ్ ధర... ప్రస్తుతం 22 వేలకు చేరింది. ట్రాక్టర్ లోడ్ ధర 3 వేల నుంచి 6 వేల రూపాయలు పలుకుతోంది. అంతంత మొత్తాలు చెల్లించలేని భవనాల యజమానులు... నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి సరఫరా అవుతున్న ఇసుకకు అధిక దర చెల్లించి మరీ కొందరు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. రీచ్‌లపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకుంటే బాధలు తప్పుతాయని నిర్మాణదారులు కోరుతున్నారు. ఇసుక కొరత నిర్మాణ రంగంతో ముడిపడిఉన్న సిమెంట్, స్టీల్ వ్యాపారం, రవాణా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.