కృష్ణా జిల్లా అజిత్‌సింగ్‌నగర్ పైపులరోడ్డు కూడలి సమీపంలో నివాసముంటున్న ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో 18 టన్నుల ఇసుకను రూ.12వేలకు బుక్ చేశారు. బుధవారం బుక్ చేసిన ఇసుక ఇచ్చిన అడ్రస్‌కు లారీ (టిప్పర్) ద్వారా చేరింది. అయితే లారీలోని ఇసుక తక్కువగా ఉండడం, ఇసుక 18 టన్నులు మేర ఉండదని గుర్తించిన బుక్ చేసిన వ్యక్తి దీనిపై లారీ డ్రైవర్‌ను నిలదీశారు. సమీపంలో నున్న మామిడి మార్కెట్ సమీపంలోని కాటా వద్ద ఇసుక తూకం వేయగా 12 టన్నుల మేరే ఉంది. ఇదేంటని లారీ డ్రైవర్‌ను ప్రశ్నించగా తమకు ఈ విషయంలో సంబంధం లేదన్నాడు. తోట్లవల్లూరు ఇసుక రీచ్ నుంచి ఇచ్చిన ఇసుకను మీ ఇంటికి చేర్చామని తేల్చి చెప్పాడు.
ఈ విషయాన్ని బాధితుడు అక్కడినుంచే మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ వైపుగా వెళ్తున్న ఇసుక లారీలను సైతం స్థానికులు ఆపేశారు. ఆందోళన పెద్దది కావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలో ఇసుక కొనుగోలు చేస్తున్న వారంతా తాము సైతం ఇదే రీతిలో మోసపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక కొనుగోళ్లలో అక్రమాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కేంద్ర ఎన్నికల అధికారులతో రఘురామకృష్ణరాజు భేటీ