Round Table Meeting on Polavaram Project: 2019 నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు నత్తతో పోటీ పడుతున్నాయని విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నేతలు మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాకపోయినా సీఎం జగన్ అడగడం లేదని.. ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదని.. విపక్షాలు మండిపడ్డాయి.
ఇప్పటికే అనేకసార్లు పోరాటాలు చేసినా.. అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేసినా.. జగన్‌లో మాత్రం చలనం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరాన్ని వెంటనే పూర్తి చేసేలా సీఎం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నాటక ఎన్నికలలో బీజేపీ నేతలంతా కలిసి పర్యటించినా అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని.. జగన్ ఇకనైనా నోరు తెరిచి ధైర్యంగా సమస్యలు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నేతలు కోరారు.
పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామన్న జగన్.. ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని మాజీ మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డయా ఫ్రం వాల్, స్పిల్ ఛానల్, ఆర్ అండ్ ఆర్కు కట్టిన డబ్బులు కూడా వచ్చాయన్న ఆయన.. 31 మంది ఎంపీలు ఉన్నా జగన్ ఎందుకు నిధులు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
పోలవరం నిర్మాణం నిలిచిపోతే కేంద్రాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయని సీఎం నిర్వాసితులను ముంచేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా తీరు మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అటు నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల గారడీ చేస్తున్నాయని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే పునరావాస ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
"దిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో వాస్తవ పరిస్థితి చెప్పకుండా.. మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పవర్ మినహా మిగతా వాటికి కేంద్రం విధిగా భరించి తీరాలి". - వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి
"మొత్తం 55 వేల కోట్ల ప్యాకేజీలో.. పునరావాసం ప్యాకేజీ మేజర్. కానీ దానిని మినహాయించి.. మిగతా వాటికి ఇస్తాం అంటున్నారు. ఈ విధంగా బాధ్యతారాహిత్యమైన వైఖరితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో ఎవరూ గెలిచినా మనకే వస్తుందిలే అని ఆలోచిస్తున్నారు. తాజా కర్ణాటక ఫలితాలు చూసి.. మనం కూడా కేంద్రానికి ఒక హెచ్చరిక పంపిస్తే పోలవరం పరిగెత్తుకుంటూ వస్తుంది". - శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
"మీకు 31 మంది ఎంపీలున్నా నిధులు ఎందుకు రావడం లేదు. పెండింగ్ బిల్లులను ఎందుకు తీసుకొనిరాలేక పోతున్నారు. మరి మా ప్రభుత్వం హయాంలో మేము ఎలా తీసుకొనివచ్చాం. మేము తీసుకొని వచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకొనిరావడం లేదు. పోలవరం విషయంలో చిత్తశుద్ధి ఉండాలి". - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
"14 వందల 29 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇస్తాము. పోలవరానికి అంతకు మించి ఇచ్చేది లేదని చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై ప్రస్తావన చేయడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎవరైనా సరే.. పోలవరం విషయంలో కలిసిరాకపోతే.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో మీరు చరిత్రహీనులు అవుతారు". - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: