రాజధాని అమరావతి విషయమై ఈ నెల 5న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నిన్న విజయవాడలో తెదేపా నేతలు సమావేశమై అఖిలపక్షం ఏర్పాటు అంశాన్ని చర్చించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... విజయవాడలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, నిపుణులను ఆహ్వానిస్తామని తెలిపారు. రాజధాని విషయమై ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతి అంటే తెదేపాదో, చంద్రబాబుదో కాదని 5 కోట్ల తెలుగు ప్రజలదని అన్నారు.
తెదేపా హయాంలో రాజధానిలో భవనాల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టామని తెలిపారు. అమరావతిపై సిట్ విచారణ చేసినా, జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా విచారించినా తమకేమీ భయం లేదన్నారు. చంద్రబాబు బస్సుపై ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని, దాడి విషయమై డీజీపీ చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. రాజధానిని మార్చకుండా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ అమరావతిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి