విజయవాడ నుంచి గన్నవరం వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ మార్గంలో.. కీలకమైన రామవరప్పాడు రింగ్ కూడలి గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాలతో పాటు ప్రముఖులు నిత్యం వేళ్లే ఈ రోడ్లు.. గోతులు తేలాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు.. రామవరప్పాడు నుంచి నున్న మార్గంలోని వంతెన మీదుగా ప్రయాణిస్తాయి. కానీ ఆ వంతెన అక్కడక్కడా సిమెంట్ కొట్టుకుపోయి.. ఊచలు పైకి కనిపిస్తున్నాయి. పాయకాపురం రోడ్డుపైనా తారు పెచ్చులు పెచ్చులు లేచిపోయింది. కండ్రిక వైపు వెళ్లే ప్రధాన మార్గంలో గజానికో గుంత కనిపిస్తోంది.
ప్రధాన కూడలిలో 3 కిలోమీటర్ల మేర..
జాతీయ రహదారుల నుంచి... విజయవాడలోని ఇతర రోడ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే మార్గాలూ ఇందుకు భిన్నంగా ఏమీలేవు. విజయవాడ ప్రకాశ్ నగర్ కూడలి వద్ద 3 కిలోమీటర్ల మేర రోడ్డుంతా గుంతలుగా మారింది. వాంబే కాలనీలోని.. వాటర్ ట్యాంకు రహదారిని డ్రైనేజీ పనుల కోసం తవ్వి అలాగే వదిలేశారు. కిలోమీటర్ మేర వర్షపు నీరు నిలిచి.. రోడ్డంతా ఛిద్రమైంది. సింగ్ నగర్ పైవంతెనపై గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలతో రద్దీగా ఉండే.. ఎస్ఆర్ఆర్ కళాశాల-రామవరప్పాడు రోడ్డు.. గోతులతో నిండింది. నిర్మలా కాన్వెంట్ రోడ్డూ ఇలాగే ఉంది.
కృష్ణా జిల్లాలోని ఇతర పట్టణ, గ్రామీణ రోడ్ల పరిస్థితి ఇంకా.. అధ్వానంగా ఉంది. విజయవాడ నుంచి నూజివీడు వెళ్లే రహదారి.. నున్న దాటిన తర్వాత పూర్తిగా పాడైపోయింది. మలుపుల్లో రహదారి కుంగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారులపైకి వచ్చి.. తిరిగి ఇంటికి వెళ్లగలమా అనే పరిస్థితి ఉందని.. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతులు మరిచారు..
మైలవరం మండలం గణపవరం రహదారుల పై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాన్ని నడపాల్సిన పరిస్థితి ఉందని.. డ్రైవర్లు వాపోతున్నారు. మరమ్మతులే మానేశారని చెప్తున్నారు. అవనిగడ్డ, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లోని మెజారిటీ రోడ్లు.. కంకర తేలి ప్రయాణసంకటంగా మారాయి..
గుత్తేదారుల స్పందన కరవు..
రహదారుల మరమ్మతులకు గుత్తేదారులు ముందుకురావడంలేదు. జిల్లాలో 181.45 కోట్ల రూపాయలతో 81 పనులకు ప్రభుత్వం టెండర్లు పిలవగా.. గుత్తేదారుల నుంచి స్పందనే కరవైంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అయి.. ఇప్పటికే పూర్తైన పనులకే బిల్లులు రావడం లేదన్నది గుత్తేదారుల వాదన.. రహదారుల అభివృద్ధి సెస్ పేరిట పన్నులు వసూలు చేసే ప్రభుత్వం.. వాటితో రోడ్లు ఎందుకు మరమ్మతులు చేయడంలేదని వాహనదారులు నిలదీస్తున్నారు.
ఇదీ చదవండి: jobs: ప్రతిభకు తగ్గ ప్యాకేజీ!..డిజిటలీకరణతో ఐటీలో పెరిగిన ఉద్యోగాలు