Road Accident: మితిమీరిన వేగం.. నిద్రమత్తు.. ఐదుగురి ప్రాణాలను బలికొంది. చిన్నారి అన్నప్రాసం కోసం బయల్దేరిన ఆ కుటుంబం అనంతలోకాలకు చేరింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద.. కల్వర్టును కారు వేగంగా ఢీకొట్టడంతో.. అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మున్సిపల్ ఉద్యోగి కుటుంబ సభ్యులు చనిపోయారు.
నిద్రమత్తులో కల్వర్టును ఢీకొన్న కారు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గౌరవరం గ్రామం వద్ద.. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన కుటుంబరావు.. తన మనవరాలు అన్నప్రాసనం కోసం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు కారులో బయలుదేరారు. శనివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో వీరు ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కుటుంబరావు, ఆయన భార్యతో పాటు, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న కుమారుడు జోషి, కోడలు, కుమార్తె, మనవరాలు కారులో ప్రయాణిస్తున్నారు. కుమారుడు జోషి కారు డ్రైవింగ్ చేస్తున్నారు. జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద నిద్రమత్తులో కల్వర్టును ఢీకొట్టారు. ప్రమాదంలో కారు ముందుబాగం దెబ్బతింది. ఘటనాస్థలంలోనే ఇంటిపెద్ద కుటుంబరావుతోపాటు కుమార్తె, కోడలు చనిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన.. కుటుంబరావు భార్య, కుమారుడు, మనవరాలిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చిన్నారి మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6నెలల చిన్నారి మృతి చెందింది. మెరుగైన చికిత్స కోసం కొర్రపాటి కుటుంబరావు భార్య మేరీ, కుమారుడు జోషిని విజయవాడకు తీసుకెళ్తుండగా మేరీ చనిపోయారు. ప్రస్తుతం జోషి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆతను చెప్పిన ప్రకారం నిద్రమత్తులోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
కల్వర్టును ఢీకొనటంతో..
నాగార్జునసాగర్ ఎడమ కాలువ వంతెనపై చిన్నపాటి మలుపును నిద్రమత్తులో గమనించకుండా.. మితిమీరిన వేగంతో ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థరించారు. కారు కల్వర్టును ఢీకొట్టి ఆగిందని.. లేకుంటే నేరుగా కాల్వలో పడిపోయేదని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
Robbery: శ్రీకాకుళంలో మూడు ఇళ్లపై దాడులు.. నగలు, డబ్బు ఎత్తుకెళ్లిన దుండగులు