తమ వృత్తికి అవరోధం కలిగిస్తూ, ఉపాధి అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఘాటుగా సమాధానం చెప్పవలసి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం కార్యదర్శి సీహెచ్ కాటయ్య హెచ్చరించారు. కృష్ణా జిల్లా, నూజివీడు మండలం, తిరువూరులోని దోబీ ఘాట్ వద్ద సచివాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుండటం దారుణమని అన్నారు. సమాజంలో వెనుకబడిన తరగతులుగా ఉన్న రజకులకు ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి, ఉపాధి అవకాశాలను దెబ్బ తీసే ప్రయత్నం చేయడం సరైనది కాదని హితవు పలికారు.
నూజివీడు నియోజకవర్గ పరిధిలో సుమారు 28 వేలకు పైగా రజక ఓటర్లు ఉన్నారని తెలిపారు. తమ వృత్తిని దెబ్బతీస్తే ఓటుతో రాజకీయ నేతల భవితవ్యం మార్చగలమని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో భాగంగా రజక వృత్తి అభివృద్ధి కోసం ఏటా రూ. 50 లక్షల మేర నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి అందజేశారు. అంతకుముందు రజక వృత్తిని రక్షించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.