కృష్ణా జిల్లాలో...
విజయవాడలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన కూడళ్లయిన బెంజ్ సర్కిల్, ఆటోనగర్, బీసెంట్ రోడ్లో వర్షపు నీటితో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుుతున్నారు. బెంజ్ సర్కిల్‌లో భారీగా నీరు నిలిచిపోవటంతో, మున్సిపల్ అధికారులు ప్రత్యేక వాహనాలతో ఈ నీటిని తోడేస్తున్నారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవటంతోనే ఈ సమస్య తలెతోందని వాహనదారులు వాపోతున్నారు.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీరులపాడు మండలం కట్టలేరు వైరా వాగు, కట్టలేరు కలిసి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. వరద నీరు కాజ్‌వే మీదగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులోకి ఎవ్వరూ వెళ్లకుండా ఎస్సై సోమేశ్వరరావు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. కంచికచర్ల ఆర్టీసీ బస్టాండ్లో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరువూరు నియోజకవర్గంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కట్లేరు, ఎదుళ్ల వాగు, పడమటి వాగు, తూర్పు వాగు, విప్లవాగుల్లో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు వాగు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తిరువూరు మండలం చౌటపల్లి, టేకులపల్లి, అక్కపాలెం, మల్లేల సమీపంలో ఎదుళ్ల వాగు, విప్లవాగుల వరద వంతెనలకు ఆనుకుని ప్రవహిస్తోంది. వరదనీటి ప్రవాహం పెరిగితే ఈ మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోనున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఖరీఫ్ వరి సాగుకు సిద్ధం చేసుకున్న నారుమడులు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఈ నెలాఖరుకు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న ఈ మడులు మరికొన్ని రోజులు ఇలానే నీటిలో ఉంటే నాటేందుకు పనికిరాదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నలమల అడవుల్లో కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లా మహానంది సమీపంలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై వంతెన మునిగిపోయింది. ఫలితంగా పలు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఇదీ చదవండి: CM Jagan alert on rains: భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు