దుర్గామల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో పాతపాడులో నిర్మిస్తున్న సౌర విద్యుత్తు ప్లాంట్ అందుబాటులోకి రావడానికి మరో నాలుగు నెలలకుపైగా సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే పూర్తయినా ట్రాన్స్‌కోకు సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ లైన్ ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతోంది. ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును సబ్‌స్టేషన్‌కు పంపించేందుకు అవసరమైన లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పాతపాడు నుంచి సబ్‌స్టేషన్‌కు లైన్ వేసేందుకు.. రెండు రోజుల క్రితం ట్రాన్స్‌కో అనుమతి ఇచ్చింది. విద్యుత్తు లైన్‌ను పలు గ్రామాల మీదుగా నున్న వరకు వేయాల్సి ఉంది. ఇప్పటికే పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్లాంట్ నుంచి ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా..ఈ ప్రక్రియకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
విజయవాడ దుర్గగుడికి ఏటా విద్యుత్తు బిల్లులు రూ.82లక్షల వరకు వస్తున్నాయి. ఈ భారం తగ్గించేందుకు నాలుగేళ్ల క్రితం సౌర ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేవస్థానానికి చెందిన ఐదు ఎకరాల స్థలం పాతపాడులో ఉంది. అక్కడ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ.. ఆ తర్వాత ప్రణాళికల దశలోనే ఆగిపోయింది. ఏడాది క్రితం మళ్లీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. పది నెలల క్రితం నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో టెండర్లను పిలిచారు. ప్లాంట్ నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ప్లాంట్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు అంతా సిద్ధంగా ఉంది. అయితే విద్యుత్‌ను సబ్‌స్టేషన్‌కు తరలించేందుకు అవసరమైన లైన్ పూర్తయితే తప్ప ఉత్పత్తి ఆరంభించడం సాధ్యం కాదు.
నాలుగేళ్లలో తిరిగి వచ్చేస్తుంది..
ఏటా 16లక్షల యూనిట్ల విద్యుత్తు ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి కానుంది. ఒక మెగావాట్ సామర్థ్యం ఉన్న ప్లాంట్ నిర్మాణానికి.. రూ.4.64 కోట్ల ఖర్చయింది. రూ.92.8లక్షలు నెడ్‌క్యాప్ నుంచి రాయితీగా వచ్చాయి. దుర్గగుడికి రూ.3.71 కోట్లు ఖర్చయింది. ప్లాంట్ ద్వారా దుర్గగుడికి అవసరమయ్యే విద్యుత్తును అందించడంతో పాటు.. అదనంగా ఏటా రూ.13.50లక్షల వరకు దేవస్థానానికి ఆదాయం రానుంది. పదేళ్లు ప్లాంట్‌ను నిర్మించిన గుత్తేదారే పూర్తిగా నిర్వహణ బాధ్యత చూసుకుంటారు. 20ఏళ్ల వరకు ఈ ప్లాంట్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం నెలకు 1.12లక్షల యూనిట్ల విద్యుత్తు వినియోగం దుర్గగుడిలో జరుగుతోంది. ఏటా 13.5లక్షల యూనిట్లకు రూ.82లక్షలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే నాలుగేళ్లలో పెట్టిన ఖర్చు తిరిగి రానుంది.
ఇవీ చూడండి...