Agitation Continues Against Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా శ్రేణుల ఆగ్రహ జ్వాలలతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్షకు జనసైనికులు సంఘీభావం తెలిపారు. హనుమాన్ జంక్షన్‌లో రోడ్డుపై మోకాళ్ల మీద నడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో టీడీపీ కార్యాలయం వద్ద మత్స్యకారులు బోటు, వలలతో నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చేపట్టిన రిలే దీక్షలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. బాపట్లలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు.
TDP Leaders Agitations Continues Against CBN Arrest : ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు ఫేస్ మాస్కులు ధరించి వినూత్న నిరసన తెలిపారు. ఒంగోలు పార్టీ కార్యాలయం వద్ద మహిళలు చేపట్టిన దీక్షకుమాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సంఘీభావం తెలిపారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన రిలే దీక్షలో మాజీ మంత్రి సోమిరెడ్డి పాల్గొన్నారు.
TDP Cadre Protest in AP: చంద్రన్న అరెస్ట్‌కు నిరసనగా కదిలిన ఆంధ్రప్రదేశ్
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుతూ అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువులో హోమం చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలోని ప్రధాన రహదారిపై TNSF నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో చెరువులో జలదీక్ష చేపట్టారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ర్యాలీగా తపాలా కార్యాలయం వరకు వెళ్లి రాజమండ్రికి పోస్ట్ కార్డులు పంపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుతూ.. తిరుపతి నగరపాలక కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో గణపతి హోమం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో రిలే దీక్షలో చంద్రబాబు సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు.
TDP Cadre Protest in AP : ఏలూరు గ్రామీణ మండలం మాదేపల్లిలో నిర్వహించిన నిరసనల్లో మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కంచాలను గరిటెలతో కొడుతూ వినూత్న నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గాడిదకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. న్యాయానికి సంకేళ్లేశారంటూ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో శ్రేణులు సంకేళ్లు వేసుకుని నిరసన తెలిపారు. చంద్రబాబుకు అందరూ మద్దతు తెలపాలని అనకాపల్లిలో ప్రజలకు కరపత్రాలు పంచారు.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రేణులు కదం తొక్కారు. అక్రమంగా అరెస్టు చేసి.. జైల్లో పెట్టి.. జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో న్యాయం కోసం నారీ గళం పేరుతో వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహిళలు ఉత్తరాలు రాశారు.