ఏపీలో బిల్లుల చెల్లింపు ప్రక్రియపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తాజాగా నిధుల పునఃపంపిణీ (రీ అప్రాప్రియేషన్) తీరునూ తప్పుబట్టింది. ఏ ప్రాతిపదికన నిధుల పునఃపంపిణీ చేపడుతున్నారన్న సమాచారం సమగ్రంగా లేదంది. ఫలితంగా బడ్జెట్ లెక్కలు ఖరారు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమగ్ర వివరాలు పంపాలని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులకు లేఖ రాయగా ప్రస్తుతం వారు ఆ సమాచారాన్ని క్రోడీకరించే పనిలో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఫార్మాట్ రూపొందించి వివరాల్ని సేకరిస్తున్నారు.
ఏటా బడ్జెట్ తర్వాత అన్ని శాఖలూ తమ కేటాయింపులకు సంబంధించి రీ అప్రాప్రియేషన్‌కు ప్రతిపాదనలు పంపుతూ ఉంటాయి. ఆయా శాఖల కేటాయింపుల్లో కొన్నిచోట్ల నిధులు తక్కువ వ్యయం చేయడం, మరికొన్ని చోట్ల ఎక్కువ ఖర్చు చేయడం వంటివి సాగుతుంటాయి. త్రైమాసిక బడ్జెట్ వినియోగం ఆధారంగా 6 నెలల తర్వాత మరోసారి ఆ బడ్జెట్ నిధినే ఖర్చుల ఆధారంగా తిరిగి సర్దుబాటు చేస్తుంటారు. వ్యయం తక్కువగా ఉన్న చోట్ల బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, ఎక్కువగా ఉన్నచోట్ల కేటాయింపులు పెంచి సర్దుబాట్లు చేస్తుంటారు. ఆయా ప్రభుత్వశాఖల ప్రతిపాదనల ఆధారంగా ఆర్థికశాఖ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తుంటారు.
కారణాలు పేర్కొనలేదు..
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో మొత్తం 143 రీ అప్రాప్రియేషన్ ఉత్తర్వులను సీఎఫ్‌ఎంఎస్‌లో జారీ చేశారని, వాటికి కారణాలు, రిమార్కులను పేర్కొనలేదని అకౌంటెంట్ జనరల్ ప్రస్తావించారు. ఏపీ బడ్జెట్ మాన్యువల్ 17వ చాప్టరు ప్రకారం అదనంగా నిధులు కేటాయించినా, కేటాయింపుల్లో మిగులు ఉన్నా కారణాల్ని స్పష్టంగా పేర్కొనాలి. తిరిగి కేటాయింపులు జరిపే క్రమంలో ఆ సమగ్ర వివరాలు ఉండాలని మాన్యువల్ పేర్కొంటోంది. అకౌంటెంటు జనరల్ కార్యాలయం తప్పుబట్టిన క్రమంలో ఆర్థికశాఖ అధికారులు స్పందించారు.
వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రీ అప్రాప్రియేషన్ ప్రతిపాదనలు ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే అందుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత ప్రొఫార్మా ప్రకారం వివరాలన్నీ పంపాలని కోరారు. ఆ వివరాలన్నీ అకౌంటెంటు జనరల్ కార్యాలయానికీ అందించాలని సూచించారు. ఇంతకుముందు రాష్ట్రంలో రూ.41,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి బిల్లులు సమగ్రంగా లేవని అకౌంటెంటు జనరల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖ పంపారు. ఆ చెల్లింపులకు సంబంధించి సమగ్ర ఓచర్లు తమకు చేరలేదని పేర్కొనడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: