Poor Drainage System in Vijayawada : పారిశుద్ధ్య నిర్వహణలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సొంతం చేసుకుందని, స్వచ్ఛతలో తమకు సాటి రాదని ప్రభుత్వం, అధికార యంత్రాంగం గొప్పలు చెబుతోంది. అవన్నీ మాటలకే.. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వారి మాటలకు భిన్నంగా ఉన్నాయి. విజయవాడలోని రోడ్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. బెజవాడలోని రోడ్లు ఎక్కడ చూసినా మురుగు కాలువలుగానే కనిపిస్తాయి. ఇక నగరంలో చిన్నపాటి చినుకుపడితే చాలు మురుగు కాలువలు, రహదారులు ఏకమవుతాయి. రోడ్లన్ని డ్రైనేజీ కాలువలుగా కనిపిస్తాయి. కంపుకొట్టే మురుగు నీళ్లలోనే ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏళ్లు గడుస్తున్న మురుగునీటి కాలువల దుస్థితి మాత్రం మారటం లేదు.
People facing drainage problem : చినుకులు పడితే చాలు.. కీలకమైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్లపై పలు చోట్ల మురుగు కాలువలుగా మారిపోతాయి. ఏళ్ల తరబడి మురుగు కాలువల విస్తరణ లేకపోవడమే ఈ దుస్థితికి కారణం. కేవలం ప్రధాన రహదారులే కాదు.. నగరంలోని పలు కీలక కూడళ్లు, కాలనీల్లో కూడా ఎన్నో ఏళ్లుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. గురునానక్ కాలనీ, పాలిక్లీనిక్ రోడ్డు, గుణదల, ఆటోనగర్, పటమట ప్రాంతాల్లో మురుగు వ్యర్థాలు నిలిచిపోతున్నాయి. మురుగునీటి కాలువల నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో ఎక్కువ రోజులు మురుగునీరు కాలువల్లో నిలిచిపోయి.. దోమలు, ఈగలకు నిలయాలుగా మారుతున్నాయి. ఫలితంగా అనారోగ్యాల బారీన పడుతున్నామని నగరవాసలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Boy died in drainage : బాలుడిని మింగిన ఓపెన్ డ్రైనేజీ.. విజయవాడలో విషాదం
Delay in drainage works నగరంలో చాలా ఇళ్లకు కనీసం ఓపెన్ డ్రెయిన్ల సౌకర్యాలు లేక.. ఇంటి యజమానులే చిన్నపాటి డ్రైనేజీలను నిర్మించుకుంటున్నారు. నగరంలో చాలా వరకు డ్రైనేజీలపై పైకప్పులు లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. బెజవాడలో పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డు, కృష్ణవేణి కాన్వెంట్ రోడ్డు, బందరు రోడ్డు వంటి ప్రాంతాల్లో నూతనంగా మురుగు కాలువల నిర్మాణ పనులు ప్రారంభించినా.. పనులు మాత్రం నత్తడకన సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల డ్రైనేజీలు శిథిలవస్థకు చేరుకున్నా ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Drinking Water Problem: ఆటోనగర్ దుస్థితి.. వానకాలంలోనూ తాగునీటి సమస్య.. వెంటాడుతున్న డ్రైనేజీ సమస్య
బెంజ్ సర్కిల్ సమీపంలోని బందరు రోడ్డుకు మరమ్మతులు చేపట్టినా ఏమాత్రం ఫలితం లేదు. ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిసినా ఆ ప్రాంతం జలమయమవుతోంది. ఓ ప్రణాళిక లేకుండా రహదారుల మరమ్మతులు చేపట్టడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయడం తప్ప ఎటువంటి ఫలితం ఉండటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా మురుగు కాలువల సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో ప్రజల నుంచి సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
UnderGround Drainage Works: ఏపీలో పడకేసిన పారిశుద్ధ్యం.. యూజీడీకి మంగళం పాడేసిన వైసీపీ సర్కార్..