Body Delivered in Parcel Case : చెక్క పెట్టెలో శవం కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి గృహ నిర్మాణ సామగ్రి పార్శిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది (సోదరి భర్త) శ్రీధర్‌వర్మ (అలియాస్ సుధీర్‌వర్మ, సురేంద్రవర్మ) ఆచూకీ నేటికీ తెలియలేదు.
మరోవైపు ఘటన జరిగిన రోజు (గురువారం) భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద రెడ్ కలర్ కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది. అక్కడి నుంచే పిప్పరకు చెందిన ఆటోడ్రైవర్‌తో పెట్టెను యండగండి తీసుకెళ్లాలని కిరాయికి చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కిన కారు ఎటు వెళ్లిందనేది గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
West Godavari District Parcel Dead Body : ఆ పెట్టె తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే ఆమె మరిది శ్రీధర్‌వర్మ పరారయ్యాడని, అతడు కూడా ఎరుపురంగు కారులోనే పరారైనట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు సదరు మహిళతో శ్రీధర్‌వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది. చెక్క పెట్టెలో వచ్చిన మృతదేహానికి పోస్టుమార్టం చేసిన నివేదికను పరిశీలిస్తే అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి వెల్లడించారు.
కేసు పురోగతిపై ఐజీ అశోక్‌కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. మరోవైపు చెక్క పెట్టెలోని మృతదేహం ఎవరిదో గుర్తుపట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు అదృశ్యమైతే తమకు తెలియజేయాలని ఉండి ఎస్సై నసీరుల్లా కోరారు.
అసలేం జరిగిదంటే : యండగండి గ్రామానికి చెందిన ముదునూరు రంగరాజు కుమార్తె సాగి తులసి అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఇంటినుంచి భర్త వెళ్లిపోవడంతో కొన్నేళ్లపాటు తల్లిదండ్రుల వద్దే ఉన్నారు. తన సోదరికి పెళ్లయ్యాక అద్దె ఇంట్లోకి మారారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇటీవల సొంత ఇల్లు నిర్మించుకున్నారు. తన ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సాయం కోసం క్షత్రియ సేవాసమితిని ఆమె ఆశ్రయించారు. ఇటీవలే వాళ్లు ఇంటి నిర్మాణ సామగ్రి పంపించారు. రెండో విడతలో ఎలక్ట్రికల్ వస్తువులు పంపుతామని మాటిచ్చారు. తీరా వచ్చిన పార్శిల్ చూస్తే మృతదేహం ఉండటంతో తులసి ఖంగుతిన్నారు.
పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకున్న విద్యార్థి - రైలు పట్టాలపై మృతదేహం - అసలేం జరిగిందంటే!