ED Inquiry On Kakinada Port : కాకినాడ సీ పోర్టును అరబిందో సంస్థ బలవంతంగా చేజిక్కించుకున్న కేసులో ఈడీ దూకుడు పెంచింది. సీ పోర్టులో వాటా కోసం అరబిందో సంస్థ చెల్లించిన రూ.494 కోట్లు ఎక్కడినుంచి సమకూర్చుకుందనే విషయంపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మనీ రూటింగ్, లాండరింగ్‌పై కీలక ఆధారాలు సేకరించింది. త్వరలోనే శరత్‌చంద్రారెడ్డి, వైవీ విక్రాంత్‌రెడ్డిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెేట్ సిద్ధమవుతోంది.
వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లో రూ.3600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్నారు. ఈ కేసులో ఆరో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించిన రూ.494 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా సమకూర్చుకున్నారు? అనే కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో మనీ రూటింగ్ ఎక్కడి నుంచి జరిగింది? దీని వెనక ఎవరున్నారో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది.
Kakinada Port Case Updates : కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్‌లోని 41.12 శాతం వాటాల విలువ దాదాపు రూ.2500కోట్లు కాగా దాన్ని రూ.494 కోట్లు తక్కువ విలువ కట్టి అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. కార్పొరేట్ డిపాజిట్ అగ్రిమెంట్ కింద 2020 జులై 10న రూ.100 కోట్లు, ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 9న మిగతా రూ.394 కోట్లు చెల్లించింది. ఆయా చెల్లింపులు జరగటానికి కొన్నాళ్ల ముందు ఆరో ఇన్‌ఫ్రా లావాదేవీలపైనా ఈడీ వివరాలు సేకరించింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. దీనిపై త్వరలో ఆరో ఇన్‌ఫ్రాం డైరెక్టర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. వారికి ఒకటి, రెండ్రోజుల్లో నోటీసులు ఇవ్వనుంది.
ఈ కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ సంస్థ ప్రతినిధులను ఈడీ అధికారులు తాజాగా సుదీర్ఘంగా విచారించి, వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ రూ.965 కోట్లు ఎగవేసిందంటూ ఏ ప్రాతిపదికన నివేదిక సమర్పించారో వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ సంస్థలోని వాటాలు అరబిందో పరం కాగానే ఎగవేతను రూ.9.3 కోట్లకు తగ్గించేస్తూ ఎలా నివేదిక రూపొందించారని ప్రశ్నించగా వారు నీళ్లు నమిలినట్లు తెలిసింది.
మరోసారి ఈడీ నోటీసులు : వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డికి గతంలో ఒకసారి నోటీసులు ఇవ్వగా వారు కొన్ని కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. మరోసారి వారిద్దరికీ ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. జగన్ బాబాయ్, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్‌రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్వరలో విచారించనుంది.
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!
కాకినాడ సెజ్‌లో జేగ్యాంగ్ దోపిడీ - రైతుల భూములు లాక్కున్న దాడిశెట్టి రాజా