కృష్ణా జిల్లా గన్నవరం విమానశ్రయంలో కార్గో భవననానికి అనుమతులు లభించాయి.ఈ భవనం విమానాశ్రయంలో ఎక్కడ నిర్మించాలనే స్థల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయింది. 2021 జనవరి నుంచి జూన్ వరకు భారీగా సరకు రవాణా గన్నవరం విమానాశ్రయం నుంచి జరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విమానాశ్రయంలో కేవలం 300 చదరపు మీటర్ల వైశాల్యంలో సరకు రవాణా భవనం ఉంది. భవిష్యత్తు అవసరాలకు ఈ భవనం చాలదు. ప్రస్తుతం దేశంలోని దిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాలకు మాత్రమే ఇక్కడి నుంచి సరకు ఎగుమతి, దిగుమతవుతోంది. జనవరి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపించేందుకు సన్నద్ధమవుతున్నారు.
కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఎగుమతి అయ్యే చేప పిల్లలు, మత్స్య ఉత్పత్తులు, వాణిజ్య పంటలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కానీ.. ఇక్కడి నుంచి రెండు మూడు నగరాలకు మాత్రమే సరకును పంపించేందుకు అవకాశం ఉండడంతో వ్యాపార, వాణిజ్య వర్గాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం ప్రయాణికులను తీసుకెళ్లే రోజువారీ షెడ్యూల్ విమానాల్లోనే సరకును వేసి పంపిస్తున్నారు. తాజాగా స్పైస్‌జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు ప్రత్యేకంగా సరకు రవాణా సర్వీసులను గన్నవరం నుంచి నడిపేందుకు అంగీకారం తెలిపాయి. రోజుకు 30-40 టన్నుల సరకు వస్తే.. ప్రత్యేకంగా విమాన సర్వీసులను ఏర్పాటు చేసి.. దేశంలోని ఏ మూలకైనా పంపించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహా అన్ని వ్యాపార సంఘాలకు విమానాశ్రయం అధికారులు సమాచారం ఇచ్చారు. గన్నవరం నుంచి ఈ సెప్టెంబర్, అక్టోబర్‌లో నెలకు 100 నుంచి 130 టన్నుల మధ్య సరకు ఎగుమతి, దిగుమతి జరిగింది. కొవిడ్‌కు ముందు నెలకు 300 టన్నుల వరకూ రవాణా జరిగేది. వచ్చే జనవరి నుంచి రోజుకు కనీసం 20 నుంచి 30 టన్నుల సరకును పంపించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యవసరంగా కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. 2500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవనం ప్రస్తుతానికి దేశీయ రవాణాకు వినియోగిస్తారు. భవిష్యత్తులో అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి ఆరంభమైతే.. ఇదే భవనాన్ని రెండింటికీ వినియోగించేలా నిర్మాణం చేపట్టనున్నారు.
ఇదీ చూడండి. 'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'