వెనుకబడిన తరగతుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతోపాటు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలంటూ వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు కానుంది. బీసీలకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలవుతున్న తీరును కమిషన్ ఎప్పటికప్పుడు సమీక్షించి, వారి ఆర్థికాభివృద్ధికి తగిన సిఫార్సులు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టింది. కమిషన్ విధులు, అధికారులు అందులో పొందు పరిచింది.
చైర్మన్గా హైకోర్టు న్యాయమూర్తి!
బీసీ కమిషన్కు చైర్మన్గా ప్రస్తుత లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి వ్యవహరిస్తారు. సామాజిక శాస్త్రవేత్త, బీసీల అంశాలపై పూర్తి అవగాహన ఉన్న ఇద్దరు, ప్రభుత్వ కార్యదర్శి... సభ్యులుగా వ్వవహరిస్తారు.
కమిషన్కు విశేషాధికారాలు...
కమిషన్కు విశేషాధికారులు ఉంటాయి. తన ఎదుట విచారణకు హాజరు కావాలని రాష్ట్రంలోని ఏ వ్యక్తినైనా కమిషన్ ఆదేశించొచ్చు. తనకు కావాల్సిన సమాచారాన్ని న్యాయస్థానం నుంచి, ప్రభుత్వంలోని ఏ శాఖ నుంచైనా కోరవచ్చు. బీసీల సంక్షేమానికి ప్రత్యేక సిఫార్సుల కోసం సాంకేతిక, విషయ నిపుణుల సేవలను వినియోగించుకోవచ్చు.