Pawan Kalyan Met Mallavalli Farmers: కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం మల్లవల్లిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులను కలిసిన పవన్.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆవేదన: గత ప్రభుత్వం 2016లో పరిశ్రమల కోసం రైతుల నుంచి 1,460 ఎకరాలు తీసుకుందని.. మల్లవల్లిలోని 125 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదని రైతులు తెలిపారు. నేతలు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగుదార్లకు ఎకరాకు 7.50 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని.. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా పరిహారం ఇవ్వడం లేదని రైతుల తెలిపారు.
సహజ వనరులు ఉమ్మడి సొత్తు: మల్లవల్లి రైతుల సమస్యపై స్పందిస్తూ.. సహజ వనరులు ప్రజలందరి ఉమ్మడి సొత్తు అని పవన్ కల్యాణ్ అన్నారు. మల్లవల్లి రైతులు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్నారని.. మల్లవల్లి రైతులు భూమిపట్టాలు కూడా చూపించారని పవన కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామికవాడకు 1,460 ఎకరాలు ఇచ్చిందని.. కులాలు, పార్టీలు, ప్రాంతాలవారీగా రైతులను విడదీయలేమని పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక దృష్టి సారిస్తా: రైతుల్లో ఐక్యత లేకుంటే అనేక సమస్యలు వస్తాయని.. కొత్త ప్రభుత్వం వచ్చాక మల్లవల్లి రైతుల సమస్యలపై దృష్టి సారిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. రైతులపై దాడి చేసే హక్కు ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అవసరాలకు ప్రజల నుంచి భూములు తీసుకోవచ్చు.. వాటికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రభుత్వం మారి.. కష్టాలు రెట్టింపు.. పరిహారం కోసం రైతుల పడిగాపులు
నడవలేని పరిస్థితికి తెచ్చారు: పరిహారం అడిగితే పోలీసులతో కొట్టించారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది రైతులను నడవలేని పరిస్థితికి తీసుకొనివచ్చారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. మరికొందరిని జైలుకు పంపి ఇబ్బందులు పెట్టారన్నారు. మల్లవల్లి విషయంలో రైతులకు న్యాయం జరగలేదని.. పరిహారాన్ని కొందరు రైతులకే ఇచ్చారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో పరిహారం ఆపేశారని.. రెవెన్యూ అధికారులు రైతులకు న్యాయం చేయాలని పవన్ కోరారు.
టీడీపీ, బీజేపీ అండగా ఉండాలి: అదే విధంగా పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే పోలీసులను తప్పు పట్టనన్న పవన్.. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చెప్పినట్లే పోలీసులు వింటారని అన్నారు. మల్లవల్లి రైతులకు పరిహారం ఇచ్చే వరకూ వారికి అండగా ఉంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రైతుల ఇళ్లలోకి చొరబడితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని మండిపడ్డారు. 2016లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని.. మల్లవల్లి రైతులకు టీడీపీ అండగా ఉండి.. మద్దతు పలకాలని కోరారు. బీజేపీ కూడా మల్లవల్లి రైతులకు అండగా నిలబడాలని అన్నారు.
"మల్లవల్లి రైతులకు అందరికీ నేను మాట ఇస్తున్నాను.. మీకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. ఇక నుంచి మీ హక్కు ఇది. కృష్ణా జిల్లా రెవెన్యూ వారికి కూడా చెబుతున్నాం.. మంత్రి వర్గం తప్పులు చేస్తే.. వాటిని మీరు వెనకేసుకురావద్దు. నాయకుల కోసం చట్టాలను అతిక్రమించి చేస్తే.. కొత్త ప్రభుత్వం వచ్చాక.. మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే మీ అందరికీ చెబుతున్నా.. 2024లో ప్రభుత్వం మారబోతోంది. వైసీపీ ప్రభుత్వం ఉండట్లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. దీనిపైన నేను ప్రత్యేక శ్రద్ధ పెడతాను". - పవన్ కల్యాణ్, జనసేన అధినేత