విజయవాడలోని పంచాయతీరాజ్ ఈఎన్సీ కార్యాలయం ప్రాంగణంలో రెండో రోజు పంచాయతీ ఇంజనీర్లు సహాయ నిరాకరాణ ఆందోళన కొనసాగించారు. ఐకాస ఛైర్మన్ మురళీ కృష్ణనాయుడు, ప్రధాన కార్యదర్శి బి. హనుమంతరావు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఉద్యోగులు తమ విధులు బహిష్కరించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ మూడు రోజుల పాటు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.
వీరి ఆందోళన శిబిరంలో పాల్గొన్న ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.చంద్రశేఖరరెడ్డి, ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు 2,200 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరపాల్సి ఉందని... ఈ పనుల నాణ్యత, ఇతర అంశాలపై ఇప్పటికే శాఖాపరంగా రెండు, మూడు సార్లు విచారణ నిర్వహించిన తర్వాత మళ్లీ విజిలెన్స్‌కు అప్పగించడం అంటే ఇంజనీర్లను బలిపశువులను చేయడమేనని ఆరోపించారు.