vijayawada new cp: విజయవాడ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా పాలరాజు బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుత సీపి శ్రీనివాసులు పదవీ విరమణ చేయడంతో పాలరాజు భాద్యతలు చేపట్టారు. 18 నెలల తన పదవీ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడం, పోలీసింగ్ పరంగా ప్రజలకు శాంతి భద్రతల విషయంలో, నేరాల నియంత్రణలో, ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోవడంలోను చక్కటి అనుభవం సంపాదించడమే కాక అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని శ్రీనివాసులు తెలిపారు. శ్రీనివాసులు పీడీయాక్టును పటిష్టంగా అమలు చేశారని ఇన్ఛార్జీ పోలీస్ కమిషనర్ పాలరాజు అన్నారు.
శాంతి, భద్రతల పరంగా విజయవాడ నగరం కీలకమైనది, పైగా చాలా సున్నితమైంది. ఇక్కడ పలు రకాలు నేరాలు జరుగుతుంటాయి. రౌడీషీటర్ల ఆగడాలు, బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు, వైట్ కాలర్ నేరాలు, దోపిడీలు, కబ్జాలు, తదితరాలు ఎక్కువ నమోదు అవుతుంటాయి.గతంలో ముఠా ఘర్షణలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం ఇవి కొంతవరకు తగ్గినా, పూర్తి స్థాయిలో రూపుమాపాలంటే పటిష్ట నిఘా అవసరమని నిపుణులు చెబుతున్నారు. కొత్త సీపీ గతంలో డీసీపీ హోదాలో ఇక్కడ పని చేశారు. ఆ అనుభవంతో వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సమస్యలివీ..
- విజయవాడ నగరం రైల్వే, రోడ్డు అనుసంధానం బాగా ఉండడంతో గంజాయి స్మగ్లింగ్ నగరం గుండా సాగుతోంది.
- కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఉన్న వారిపై పని ఒత్తిడి బాగా పెరిగింది. దీని వల్ల విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించలేని పరిస్థితి. రాజధాని ఇక్కడికి రావడంతో ప్రొటోకాల్, బందోబస్తు, ఎస్కార్ట్, తదితర విధులు అధికమయ్యాయి. నేరాల సంఖ్య కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. శాంతి, భద్రతల విభాగంలో వెయ్యి మందిపైగా సిబ్బంది అవసరం ఉంది. కీలకమైన టాస్క్‌ఫోర్స్, నేరపరిశోధన విభాగంలోనూ కొరత ఎక్కువగా ఉంది.
కన్నేసి ఉంచాల్సిందే..
నగరంలో మొత్తం 500కు పైగా రౌడీషీటర్లు, సుమారు 350 మంది వరకు సస్పెక్ట్ షీటర్లు ఉన్నారు. వీరితో పాటు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ను పిలిపించి హెచ్చరిస్తున్నారు.సుమారు 18 మంది రౌడీషీటర్లపై నగర బహిష్కరణ ఉంది. ఏదైనా జరిగాక హడావుడి కన్నా వీరిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
వాహనాల కొరత..
కమిషనరేట్‌లో మొత్తం 22 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. నగర పరిధిలో శాంతి, భద్రతల పోలీసుస్టేషన్లు 12 ఉన్నాయి. వీటిల్లో దాదాపు 60 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కీలకపాత్ర పోషించే వీరికి వాహనాలు లేకపోవడం వల్ల కేటాయించిన ప్రాంతాలపై పట్టు సడలుతోంది. స్టేషన్‌కు ఉన్న ఒక్క రక్షక్‌ను ప్రధానంగా రాత్రి పూట గస్తీకి వాడుతున్నారు. అదనంగా కనీసం రెండు జీపులైనా ఇవ్వాలి.
పరిశోధనలో జాప్యం..
నిఘా నిస్తేజంగా మారింది. సీసీ కెమెరాలు సక్రమంగా లేక నేర పరిశోధనలో జాప్యం జరుగుతోంది. అసలు విజయవాడ నగరానికి తగ్గ స్థాయిలో సీసీ కెమెరాలు లేవు. పేరుకు దాదాపు 3వేల కెమెరాలు ఉన్నాయి. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కేసుల పరిష్కారంలో, నేరస్థులను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించాల్సిన నిఘా నేత్రాలు మసకబారుతున్నాయి. కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు పాతవి బాగు చేయాలి.
ఇదీ చూడండి:
TIRUMALA: తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్ మూసివేత