రాష్ట్రంలో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నిచోట్లా ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్ర నుంచి కూడా ఉల్లి దిగుమతి అంతంతమాత్రంగా ఉండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో ఉల్లి పండే కర్నూలు జిల్లాపైనా వర్షాల ప్రభావం ఉండటంతో ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు తెలుపుతున్నారు. ఉల్లి దిగుబడి తగ్గిపోవడం వల్ల.. ఉన్న కొద్దిపాటి సరుకును దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలు పెంచుకుంటూ పోతున్నారు.
విజయవాడ రైతు బజార్లో కేజీ ఉల్లి రూ. 65 మేర ధర నిర్ణయించినప్పటికీ ఎక్కడా ఉల్లి లభించట్లేదు. వర్షాల కారణంగా ఉన్న కొద్దిపాటి స్టాక్ కూడా దెబ్బతింటుందనే భయంతో విక్రయదారులు అందుబాటులో ఉంచట్లేదు. ఇక దుకాణాలలో ఆ ధర.. పాయ నాణ్యతను బట్టి 70 రూపాయల నుంచి 90 రూపాయల వరకూ పలుకుతోంది.
గుంటూరు జిల్లా పెనుమాకలో పండే ఉల్లి పంటపైనా వర్షాలు, రాజధాని ప్రభావం పడటంతో అక్కడి రైతులెవ్వరూ పంట వేసేందుకు మొగ్గు చూపట్లేదు. ఎకరాకు 100కేజీలైనా పంట వస్తుందనే అశతో చొరవ చూపితే... 15 కేజీలు కూడా దిగుబడి రావట్లేదని రైతులు వాపోతున్నారు.
తగ్గిన దిగుమతి...
రాష్ట్రానికి ఎక్కువగా ఉల్లి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి అవుతుంది. కాని వర్షాల కారణంగా అక్కడి నుంచి దిగుమతి తగ్గిపోయింది. వివిధ జిల్లాలకు కర్నూలు నుంచి సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలల్లో ఉల్లి మార్కెట్కు వస్తుంటుంది. అయితే వర్షాల వల్ల వేసిన పంట పాడవటంతో పాటు.... వాతావరణ పరిస్థితులు కారణంగా ఇప్పట్లో కొత్త పంట వేసే పరిస్థితి లేదని డీలర్లు చెప్తున్నారు.
తప్పవు తిప్పలు...
నవంబర్లో అయినా వాతావరణ పరిస్థితులు అనుకూలించి కొత్త పంట వేస్తే.. అది అందుబాటులోకి రావటానికి మరో 3 నుంచి 4నెలలు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు రైతులు. లాక్డౌన్ సమయంలో రవాణా, ఇతర ఇబ్బందుల వల్ల పంట పొలంలోనే వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడగా.. ఇప్పుడు పంటే పూర్తిగా దెబ్బతినటంతో 4 నెలల వరకు ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరల బాగా పెరిగాయి. దీంతో ఇంట్లో కూర వండలేని పరిస్థితి ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి