నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైనా... కచ్చితంగా తమ ప్రభుత్వం అందజేసి తీరుతుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజల అవసరాలపై అంకితభావం లేకపోవడం దురదృష్టకరమన్న ఆయన.. సాంకేతిక అంశాలపై న్యాయస్థానంలో వాజ్యాలు వేయించి పట్టాల పంపిణీ నిలుపుదలకు కారకులయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తామంటూ తీసుకొచ్చిన షేర్ వాల్ టెక్నాలజీ పూర్తిగా దోపిడీ కోసమేనని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇళ్ల నిర్మాణాల విషయంలో రూ.400కోట్ల ప్రజాధనం ఆదా చేశామని అన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పరిశీలించి నిరసన తెలియజేస్తామంటున్న తెదేపా నేతలు... వారి హయాంలో ఎందుకు ఒక్క ఇళ్లు కూడా లబ్దిదారునికి అందజేయలేకపోయారో సమాధానం చెప్పాలని మంత్రి బొత్స అన్నారు.
ఇదీ చదవండి: