ఆంధ్రప్రదేశ్‌లోని పౌర హక్కుల సంఘం , విరసం నాయకుల ఇళ్లల్లో బుధవారం సాయంత్రం ప్రారంభమైన జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు .. గురువారం ఉదయం వరకూ కొనసాగాయి . మావోయిస్టులకు సమాచారం చేరవేస్తున్నారని , ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారనే ఆరోపణలపై తొలుత విశాఖపట్నం గ్రామీణ జిల్లా ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు ఆ తర్వాత ఎన్ఐఏకు బదిలీ చేశారు.
పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో మావోయిస్టు సాహిత్యం, జెండాలు, మావోయిస్టు పత్రికా ప్రకటనలతో పాటు హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 31 ప్రాంతాల్లో సోదాలు చేశామని... పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లల్లో 40 చరవాణిలు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్ డిస్కులు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్‌డ్రైవ్‌లు, టాబ్, ఆడియో రికార్డర్‌తో పాటు రూ.పది లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సోదాలు...
కొడవళ్లు, గొడ్డలి వంటి ఆయుధాలతో పాటు రూ.10 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూల్, కృష్ణ, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
గతేడాది నవంబర్ 23న ముంచింగిపట్టులో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన పంగి నాగన్నను ప్రశ్నించారు. అతని నుంచి పలు పేలుడు పదార్థాలతో పాటు.. మావోయిస్టు లేఖలు స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివాసీ, గిరిజనులను గ్రేహౌండ్స్ దళాలకు వ్యతిరేకంగా పంగి నాగన్న రెచ్చగొడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
నేతలను ప్రశ్నిస్తున్న అధికారులు...
పంగి నాగన్న ఇచ్చిన సమాచారం మేరకు అన్నపూర్ణ, కోటేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు, రాజేశ్వరి, అంజమ్మలను పోలీసులు ఇది వరకే అరెస్ట్ చేశారు. మార్చి 7న పంగి నాగన్న కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో భాగంగా బుధవారం తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు అనుబంధ సంఘాల నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వి . చిట్టిబాబు , చిలుకా చంద్రశేఖర్ , నంబూరి శ్రీమన్నారాయణ , టి . ఆంజనేయులు తదితరులు విజయవాడలోని ఎన్ ఐఏ క్యాంపు కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని ఎన్ఐఏ క్యాంపు కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు అధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చార . మరి కొంతమందిని విశాఖపట్నంలో విచారణకు రమ్మని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన పలువురి ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల ఇళ్లలో సోదాలు పూర్తైన తర్వాత... వాళ్లను గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని నోటీసులిచ్చారు. ఎన్ఐఏ కార్యాలయానికి వెళ్లిన ప్రజా సంఘాల నేతలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల ఇళ్లల్లో స్వాధీనం చేసుకున్న మావోయిస్టు సాహిత్యం, లేఖలు, జెండాల గురించి వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి. గవర్నర్‌కు లేఖల లీకేజీ కేసు వచ్చే మంగళవారానికి వాయిదా