Nara Lokesh: కృష్ణాజిల్లా గుడివాడలో ఓ సినిమా థియేటర్‌కు అనుమతులు ఇవ్వలేదని.. తహసీల్దార్ శ్రీనివాసరావుపై.. వైకాపా నేత చేసిన దాడిని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి సమక్షంలోనే.. ఘటన జరగటం దుర్మార్గమన్నారు. జగన్ రెడ్డి నిరంకుశ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.
ఆ నాడు వైద్యుడు సుధాకర్ పై వేధింపుల నుంచి.. నేడు తహసీల్దార్ శ్రీనివాసరావుపై దాడి వరకూ దళితులపై వైకాపా దౌర్జన్యం కొనసాగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌పై దాడికి పాల్పడిన మంత్రి అనుచరుడు పద్మారెడ్డిని.. తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ ఉద్యోగుల నిరసన..
గుడివాడ మండల తహసీల్దార్‌పై దాడిని ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వ అధికారిపై.. దౌర్జన్యంగా ప్రవర్తించడం సరికాదని వెంటనే పద్మా రెడ్డి ఎమ్మార్వోకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలో కొందరు వ్యక్తులు పద్మారెడ్డిని అడ్డుకున్నప్పటికీ ఆయన ఉద్దేశపూర్వకంగానే ఎమ్మార్వో పై దుర్భాషలాడారని.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
వివేకా హత్య కేసు నిందితులకు రక్షణ కల్పించాలి.. జైళ్ల శాఖ డీజీకి వర్ల లేఖ