కృష్ణా జిల్లాలో రెండో దశ ఎన్నికలకు నేడు తెరలేవనుంది. గుడివాడ డివిజన్‌లో పల్లెపోరు ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే విజయవాడ డివిజన్‌లో తొలిదశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామపత్రాల దాఖలు కార్యక్రమం ముగిసి, ప్రస్తుతం వాటి పరిశీలన సాగుతోంది.
రెండో దశలో ఎన్నికలు జరిగే గుడివాడ డివిజన్‌లో 9 మండలాలు ఉన్నాయి. ఆయా మండలాలకు ఇప్పటికే అధికార యంత్రాంగం ఎన్నికల సామగ్రిని తరలించింది. అధికారులు మంగళవారం నుంచి నామినేషన్లను అందుబాటులో ఉంచడంతో పాటు స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ డివిజన్‌లో ప్రధానంగా వైకాపా, తెదేపా మద్దతుదారుల మధ్య ప్రధాన పోరు ఉండనుంది. ఆయా పార్టీలు సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులను ఖరారులో తలమునకలయ్యారు. మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో జరిగే పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పలు పంచాయతీలను సమీప పురపాలిక, పంచాయతీలో విలీనం చేయడంతో ఈసారి గుడివాడ డివిజన్‌లోని తొమ్మిది పంచాయతీలు, 108 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. గుడివాడ మండలంలోని బిళ్లపాడు, లింగవరం, మల్లాయపాలెం, బొమ్ములూరు, వలివర్తిపాడు, భూషణగుళ్ల పంచాయతీలను గుడివాడ మున్సిపాలిటీలో విలీనం చేశారు. కూరాడ, కౌతవరం పంచాయతీలను గుడ్లవల్లేరు పంచాయతీలో విలీనం చేశారు. దీంతో ఈ మూడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.
ఎన్నికలు జరిగే మండలాలు
గుడివాడ, కైకలూరు, నందివాడ, మండవల్లి, పెదపారుపూడి, ముదినేపల్లి, పామర్రు, కలిదిండి, గుడ్లవల్లేరు
ముఖ్యమైన తేదీలు ఇవే...
ఎన్నికల ప్రకటన, నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి, 2
నామినేషన్ల స్వీకరణకు ఆఖరు ఫిబ్రవరి, 4
నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి, 5
నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు ఫిబ్రవరి, 6
అప్పీళ్ల పరిష్కారం ఫిబ్రవరి, 7
ఉపసంహరణకు ఆఖరుతేదీ ఫిబ్రవరి, 8
అభ్యర్థుల తుది జాబితా ఫిబ్రవరి, 8
పోలింగ్ ఫిబ్రవరి, 13
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఫిబ్రవరి, 13
ఇదీ చదవండి