అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా నిర్వహించే మహానాడు కార్యక్రమంలో వెంకన్న తన స్వగృహం నుంచి ఆన్లైన్లో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదని... పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులకు రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలపై గౌరవం లేదని... అందుకు ఇటీవల న్యాయవ్యవస్థపై వారు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో తెదేపా తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని... తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.