MIRCHI FRMERS: కృష్ణాజిల్లా దివిసీమలోని మిర్చి రైతులు తెగుళ్లతో భయాందోళనకు గురవుతున్నారు. వేలాది ఎకరాల్లో వేసిన మిర్చి పంటలో కొత్తరకం తామర పురుగు ఆశించి మిర్చి రైతును కోలుకోలేని దెబ్బతీస్తోంది. కొన్నిచోట్ల మొక్కలు వేసిన 20 రోజులకే రసం పీల్చు పురుగులు ఆశించి మొక్కలు వాడిపోతున్నాయి. మరికొన్నిచోట్ల పంట వేసి 45 రోజులు కాకముందే తోటలో తామర పురుగు వల్ల రైతులు బెంబేలెత్తుతున్నారు.
పువ్వులు, లేత కాయలు, ఆకుల్లో కూడా ఈ తామర పురుగు రూపాంతారాలు చెంది పంటను సర్వ నాశనం చేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని మందులు కొట్టినా.. ఫలితం లేకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్నామని అన్నదాతలంటున్నారు.
ఈ ఏడాది మార్కెట్లో మిర్చికి మంచి ధర ఉందని.. కానీ కొత్త తెగుళ్లతో మిరప పంట మొదటి దశలోనే నాశనమైందని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడైనా రాకపోతుందా అనే ఆశతో.. పురుగుల మందులు, ఎరువులను పిచికారి చేస్తున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయే తప్ప.. ప్రతిఫలం ఉండటం లేదని రైతులు విలపిస్తున్నారు. ఇంతగా తెగుళ్లు మిర్చి పంటపై దాడి చేస్తున్నా.. ఉద్యానశాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, కనీసం రైతులకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి పంటను శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి.. రైతులు మరింత నష్టపోయేముందే చర్యలు తీసుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
HOSPITAL TO RTC EMPLOYEES: ఏపీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఆసుపత్రి