రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించే అంశంపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ... రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ వివిధ అంశాలపై చర్చించింది.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవటంతో పాటు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశ్రమల పున:ప్రారంభ సమయంలో తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసే అంశాన్ని కూడా చర్చించారు. ఈ అంశంపై ప్రత్యేకంగా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులతోనూ మంత్రి సమావేశమయ్యారు.
కరోనా కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న సూక్ష్మ, చిన్న మద్యతరహా పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు కొత్తగా అమలు చేయాల్సిన ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై చర్చించారు. ఆరేళ్ల నుంచి ఉన్న ప్రోత్సాహకాల బకాయిలలో సూక్ష్మ పరిశ్రమలకు రూ.128 కోట్లు, చిన్న పరిశ్రమలకు రూ.373 కోట్లు, మధ్య తరహా పరిశ్రమలకు రూ.15 కోట్లను విడుదల చేసే అంశంపై సమీక్షించారు. చక్కెర పరిశ్రమల అభివృద్ధిపై చక్కెర కర్మాగారాల విభాగం అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఇదీ చదవండి: