సొంత మగ్గం కలిగి ఉండి చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న నేతన్నలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం రెండో విడత అమలులో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి చేనేత.. లబ్ది పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హత కలిగి ఏ ఒక్కరూ ప్రభుత్వ సాయం పొందకుండా ఉండే పరిస్థితి లేకుండా చూడాలని మంత్రి సూచించారు. జూన్ నెలలో రెండో విడత నేతన్ననేస్తం ప్రారంభం కానున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన చేనేతల జాబితా, పూర్తి వివరాలు, ఆన్‌లైన్ పోర్టల్ అప్ లోడ్, వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్న విషయంలో కొన్ని కీలక అంశాలపై ఏజెన్సీ ద్వారా కచ్చితమైన సర్వే చేపట్టాలన్నారు. వస్త్ర పరిశ్రమ ప్రాముఖ్యతను, ఉత్పత్తుల నాణ్యతను, ప్రచారాన్ని పెంచి చేనేతల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నేడో, రేపో భారత్కు మాల్యా.. నేరుగా కోర్టుకే!