విజయవాడకు చెందిన డాక్టర్ నడిపల్లి రవికుమార్.. విభిన్న ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. వృత్తి రీత్యా ఓ ప్రైవేటు పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈయన.. 10 ఏళ్ల నుంచి చాక్ పీసులపై ఆకృతులు చెక్కుతున్నారు. 300 అవార్డులు ఈయన్ను వెతుక్కుంటూ వచ్చివాలాయి. పెన్సిల్‌పై చెక్కిన గణపతి, చాక్‌పీస్‌పై చెక్కిన గణపతి, పొత్తిళ్లలో చిన్నారితో ఉన్న తల్లి ఇలా ఎన్నో ఆకృతులకు జీవం పోశారు రవికుమార్.
చాక్పీస్లపై బొమ్మలు చెక్కడమే కాక వాటిని చిన్న చిన్న అక్షరాలుగా సైతం సిద్ధం చేసి.... స్వాతంత్ర, గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు రవికుమార్. తెలుగు ప్రజల ఆరాధ్యుడు ఎన్టీఆర్ అంటే తనకున్న అభిమానాన్ని చాటుతూ.. పెన్సిల్ పై మహానాయకుడి చిత్రాన్ని చెక్కారు. అలాగే శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన అబ్దుల్ కలాంను స్మరిస్తూ.... చాక్ పీస్ పై ఆయన బొమ్మ గీశారు. ధర్మ పోరాట దీక్ష సమయంలో జైచంద్రబాబు అనే అక్షరాలతో..... చంద్రబాబు చిత్రాన్ని గీశారు.
7 మిల్లీమీటర్ల పొడవుతో బొటనవేలుపై నిలబెట్టే విధంగా అత్యంత చిన్న క్యాలెండర్‌ను 2018లో రూపొందించి అందరి ప్రశంసలు పొందారు. ఈయనలోని సృజనాత్మకతను, కళపై ఉన్న గౌరవాభిమానాలను గుర్తించి... 2015లో అమెరికాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ ఏడాది జులై 27న చెన్నైలోని తమిళ యూనివర్శిటీ వాళ్లు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. ఇలా.. రవికుమార్ ప్రతిభను దాదాపు 18 ప్రపంచ రికార్డులు గుర్తించాయి.
సూక్ష్మకళాకృతులతో గెలుచుకున్న అవార్డులను భద్రతపరుచుకునేందుకు ఇంట్లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకున్నారు రవికుమార్. తనలోని కళకు, సృజనాత్మకతకు ఎప్పటికప్పుడు పదను పెడుతూ మరిన్ని వినూత్నమైన కళాకృతులను రూపొందించేందుకు కృష్టి చేస్తానంటున్నారాయన.