Lokesh Yuvagalam Postponed : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. 200 రోజులకు పైగా కొనసాగింది. చంద్రబాబు అరెస్టు నాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చేరింది. ఈ నెల9న పొదలాడ నుంచి ప్రారంభం కావాల్సిన యాత్ర చంద్రబాబు అరెస్టు కారణంగా నిలిచిపోయింది.
చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలతో లోకేశ్ సమీక్షించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ వ్యవహారాల నిర్వహణ, పర్యవేక్షణకు పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోకి చంద్రబాబు ఆదేశాల మేరకు 14 మంది సభ్యుల్ని తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు, నేతలను సమన్వయం చేసుకోవడంతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీకి మద్దతుగా వచ్చే రాజకీయ, ప్రజాపక్షాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. అదే విధంగా క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంది.
చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండగా.. రాష్ట్రంలో పరిస్థితిని వివరించడంతో పాటు వైసీపీ సర్కారు వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు లోకేశ్ దిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో జాతీయ మీడియాకు పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. యువగళం పాదయాత్ర దాదాపు 20రోజులుగా నిలిచిపోగా.. పునఃప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. ఈ తరుణంలో పాదయాత్రను ఈ వారంలోనే తిరిగి చేపట్టాలని నిర్ణయించగా... పార్టీ సీనియర్ నాయకులు వాయిదా వేయాలని కోరుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అక్టోబర్ 3 న సుప్రీం కోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ని పార్టీ ముఖ్య నేతలు కోరారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు తో అనేక కేసులు తెరపైకి తెచ్చి చంద్రబాబుని ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నందున లోకేశ్ దిల్లీ లోనే ఉండి న్యాయవాదులతో సంప్రదింపులు చేయడం అవసరమని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేశ్ వద్ద పేర్కొన్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాల తో ఏకీభవించిన లోకేశ్ యువగళం పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.
రాష్ట్రంలో మహిళలకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితం అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని లోకేశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అత్యధిక శాతం మహిళలు... లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని ట్వీట్ చేశారు. పోలీసులు మహిళల భద్రతను పట్టించుకోకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో నిమగ్నమయ్యారని లోకేశ్ మండిపడ్డారు.