Lokesh With BC Community Leaders in Yuvagalam : ఎన్టీఆర్ జిల్లా నిడమానూరు శివారు క్యాంప్ సైట్లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. మీటింగ్ ఆవరణలో వివిధ చేతి వృత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కుల వృత్తులను ఆసక్తిగా తిలకించి వారు పడుతున్న కష్టాల గురించి నారా లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. రజక, నూర్ బాషా - దూదేకుల, కుమ్మరి, నాయీ బ్రాహ్మణ, ఎంబీసీ, మహేంద్ర, యాదవ, మత్స్యకార, ముదిరాజ్, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ, సగర, కలంకారీ, చేనేత కుల వృత్తుల ప్రదర్శన చూసి.. వృత్తుల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి స్టాల్ దగ్గర ఆగి.. వారి సమస్యలు, టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి కులవృత్తి దారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
దోబీ ఘాట్లు కూడా కబ్జా చేస్తున్న వైసీపీ నేతలు.. జగన్ నాయీ బ్రాహ్మణులను మోసం చేశాడని, దేవాలయాల్లో పనిచేసే తమని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మర్చిపోయాడని ఆరోపించారు. టీడీపీ తమకు న్యాయం చేయాలని, తమకు ఆరోగ్య భద్రత (Health security), ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. గీత కార్మికులకు జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, తమకు వృత్తి, ఆరోగ్య భద్రత కల్పించాలని లోకేశ్‌కు విన్నవించారు. విధులు, నిధులు లేని కార్పోరేషన్లు ఏర్పాటు చేసి జగన్ బీసీలకు అన్యాయం చేశాడంటూ మండిపడ్డారు. బీసీ సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నామని, యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. రజక సోదరులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దేవాలయాల్లో దోబి పనులు (Dobi Ghats) రజకులు ఇవ్వాలని కోరారు. వైసీపీ దోబీ ఘాట్స్ కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
నాయీ బ్రాహ్మణులకు లోకేశ్ భరోసా.. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి జగన్ మోసం చేశాడని నారా లోకేశ్(Nara Lokesh) ధ్వజమెత్తారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారిని కూడా రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేశాడంటూ మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం తలనీలాల పై వచ్చే ఆదాయంలో పది శాతం వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు. జగన్ పాలనలో గీత కార్మికులు సంక్షోభంలో ఉన్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని వెల్లడించారు. నీరా కేఫ్ లు ప్రారంభిస్తామని, లిక్కర్ షాపుల్లో వాటా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు, నిధుల కేటాయింపు టీడీపీ మాత్రమే చేసిందని గుర్తు చేశారు. నిధులు, విధులు లేని కార్పోరేషన్లు జగన్ ఏర్పాటు చేశాడంటూ మండిపడ్డారు. బీసీ శాఖ మంత్రి పేషీలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి జగన్ పాలనలో ఉందని విమర్శించారు.
టీడీపీ హయాంలో కుల వృత్తులను కాపాడటానికి ఆదరణ పథకం అమలు చేశామని, అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. జగన్ విధ్వంస పాలన వలన ఎవరికీ ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొందని, అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు రూ.20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. బీసీలకు పుట్టినిల్లు, ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం, కీలకమైన పదవులు, శాఖలు ఇచ్చింది టీడీపీ మాత్రమేనని లోకేశ్ గుర్తు చేశారు.
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం... స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు, జనతా వస్త్రాలు, ఆదరణ పథకం, బీసీలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి బీసీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేసింది టీడీపీ అని అన్నారు. జగన్ పాలనలో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేశాడంటూ ఆరోపించారు. జగన్ పాలనలో కీలక పదవులు అన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని, టీడీపీ హయాంలో అన్ని కీలక పదవులు బీసీలకు ఇచ్చామని చెప్తూ.. ఒకసారి పునరాలోచించుకోవాలన్నారు. 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. జగన్ బీసీల గురించి మాట్లాడుతున్నాడంటే.. అందుకు కారణం టీడీపీనే అని చెప్పిన లోకేశ్.. తన మీటింగ్ లో కూర్చున్న వ్యక్తిని తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఇచ్చాడని తెలిపారు.