భారీ వర్షాలకు మున్నేరు పొంగి పొర్లింది. గడిచిన 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ వరద పోటెత్తింది. ఫలితంగా కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల వంతెన పూర్తిగా ధ్వంసం అయింది. తెలంగాణ నుంచి పోటెత్తిన నీటి ప్రవాహం రోజుకు 1.30 లక్షల క్యూసెక్కులు వంతెనపై నుంచి వారం రోజుల పాటు పారింది.
800 మీటర్ల పొడవైన వంతెనలో సుమారు 20 మీటర్ల మేర కాంక్రీట్ పలకలు కొట్టుకుపోవటంతో పాటు, వంతెనపై పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వంతెనపై వారం రోజుల పాటు వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మున్నేరుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 1.30 లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్లే వంతెన పైభాగంలోని కాంక్రీట్ పలకలు కొట్టుకుపోయాయని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు.
వంతెన కింది భాగంలో చెత్త, ఇసుక మేటలు ఏళ్ల తరబడి నుంచి తొలగించక పోవటంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది . దీనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వరద నీరంతా వంతెన పైనుంచి పారింది. వంతెన నిర్మాణం చేపట్టి, ధ్వంసమైన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి