ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 7లక్షల 37 వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి 8లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో 88 విపత్తు నిర్వాహక బృందాలను అధికారులు మోహరించారు. 12 మండలాల పరిధిలో.. 39 గ్రామాల్లో వరద ప్రభావం ఉంది. ఇప్పటికే 8 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సుమారు 537 నివాసాలు ముంపు బారిన పడ్డాయి. కొల్లూరు మండలంలో 2వేల 500 ఎకారాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులు అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న 5 మండలాల్లో 7 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద అంతకంతకూ పెరుగుతోందని తెనాలి ఆర్డీవో శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రేపల్లె నుంచి సుమారు 20 మర పడవలను తెప్పిస్తున్నట్టు వెల్లడించారు. వరద నీటితో రాకపోకలు నిలిచిన చోట పడవల సాయంతో సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
నీట మునిగిన భవానీ ద్వీపం...
కృష్ణానది వరద ప్రవాహం పెరగటంతో విజయవాడలోని భవానీ ద్వీపంలోకి వరద నీరు చేరింది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుండటంతో ద్వీపంలోకి నీరు వస్తోంది. ద్వీపంలోని కాటేజీల వద్దకు వరద నీరు చేరింది.
ఇది కూడ చదవండి.