పరిషత్ ఎన్నికల పోలింగ్‌ను కృష్ణా జిల్లా అధికారులు పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిస్థితులపై ఆరా తీశారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరచడంపై సిబ్బందికి పలు ఆదేశాలు జారీచేశారు.
గుడివాడలో...
గుడివాడలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కౌతవరం, చౌటపల్లి గ్రామాల్లా పోలింగ్ సరళని ఆయన పరిశీలించారు. కరోనా కట్టడికి జాగ్రత్తలు బాగున్నాయంటూ వైద్య సిబ్బందిని అభినందించారు. సుమారు 45 శాతానికి పైగా పోలింగ్ జరిగినట్లు వెల్లడించారు.
పెనుగంచిప్రోలు, మైలవరంలో...
అనిగండ్లపాడు, శివపురం, గుమ్మడిదుర్రు గ్రామాల్లో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పర్యటించారు. ఎన్నికల సరళిపై పోలింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జి.కొండూరు, మైలవరం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలనూ డీఎస్పీ శ్రీనివాసులతో కలిసి ఆయన పరిశీలించారు.
అవనిగడ్డలో...
బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లను మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి పరిశీలించారు. అవనిగడ్డలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యటించి.. గదుల్లోని కిటికీలకు ఇనుప మెష్ కొట్టించాలని ఆదేశించారు. కిటికీలు, తలుపులు నుంచి క్రిమికీటకాలు, చెదలు చొరబడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల పర్యవేక్షణకు 24 గంటలు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అవనిగడ్డ డీఎస్పీ మహమ్మద్ బాషా, ఎంపీడీవో లక్ష్మీ కుమారి, సీఐ రవికుమార్, తహసీల్దార్ శ్రీను నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గన్నవరంలో...
పరిషత్ ఎన్నికల పోలింగ్ సరళిని విజయవాడ సీపీ శ్రీనివాసులు పరిశీలించారు. కమిషనరేట్ పరిధిలోని అన్నిచోట్లా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. భద్రత ఏర్పాట్లలో సుమారు 1,600 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
పరిషత్ పోరు: కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్