కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. గవర్నర్‌పేట నీటిపారుదల శాఖ ఆవరణలోని రైతు శిక్షణా కేంద్రంలో జరిగిన సమీక్షకు మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్‌లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో తుపాను కారణంగా పంట నష్టం సహా.. సహాయక చర్యలు, వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హమీ, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ క్లినిక్‌ల నిర్మాణ ప్రగతి, నాడు – నేడు సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు.
నివార్ తుపాను నష్టం, సాయంపై పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమస్యలను ఏకరువు పెట్టారు. చాలాచోట్ల కౌలుదారులు, సహా పంట నష్టపోయిన వారి వివరాలను అధికారులు నమోదు చేయడం లేదని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి ఫిర్యాదు చేశారు. గతంలో ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులంటే అధికారులకు చులకన భావం ఉందన్న ఎమ్మెల్యే.. జిల్లా పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యం నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట నష్ట పోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని సీఎం ఆదేశించినా .. పంటనష్టం నమోదులో అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్నారని మరో అధికార ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులందరికీ న్యాయం చేయాలని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, రామకృష్ణ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులందరి వివరాలు నమోదు చేసి అందరికీ పరిహారం వర్తింపు సహా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ఇసుక సమస్య ఉందని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో వాగుల నుంచి ఇసుక రవాణాకు కలెక్టర్, జేసీ అనుమతివ్వాలని కోరారు. ముంపు నివారణకు అధికారులు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. గన్నవరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో భూ సేకరణ సమస్యలు ఉన్నాయని సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. విమానాశ్రయం, పరిశ్రమలు, హైవేలు, కార్యాలయాల పేరిట రైతుల నుంచి భూములు సేకరించారని.. పరిహారం అందక రైతులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. కలెక్టర్, జేసీల సమావేశం ఏర్పాటు చేసి సత్వరమే సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: ఏలూరులో పెరుగుతున్న బాధితులు.. ఇవాళ ఒక్కరోజే...!