కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ పీఠం(Kondapalli Municipal Chairman Election) ఎవరి వశమవుతుందనే ఉత్కంఠ వీడలేదు. మున్సిపాల్టీలోని 29 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా నుంచి 14, తెదేపా తరఫున 15మంది గెలుపొందారు. సంఖ్యాబలం ప్రకారం తెదేపాకు ఒక అభ్యర్థి బలం ఎక్కువగా ఉన్నా... ఛైర్మన్ పీఠం కైవసం కోసం అధికార వైకాపా పావులు కదుపుతోంది. తెదేపా సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైకాపా నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తెదేపా నుంచి ఎంపీ కేశినేని నాని ఎక్స్అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఐతే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓటు హక్కు వినియోగానికి కేశినేని నాని సమ్మతి తెలిపినందున ఆయన ఓటు చెల్లదంటూ వైకాపా ఆరోపణలకు దిగింది. కేశినేని కోర్టును ఆశ్రయించటంతో కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు న్యాయస్థానంఆయనకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఎన్నికకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నిర్వహించాయి.
వైకాపా కౌన్సిలర్ల వీరంగం
ప్రత్యర్థుల్ని లోబర్చుకునేందుకు.. బెదిరింపులు, ప్రలోభాల పర్వం జోరుగా సాగింది. తెదేపా అభ్యర్థులకు మాజీమంత్రి దేవినేని ఉమా తన నివాసంలోనే క్యాంపు ఏర్పాటు చేసి గొల్లపూడి నుంచి కొండపల్లి తీసుకొచ్చారు. ప్రమాణ స్వీకార ప్రక్రియ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నేతృత్వంలో వైకాపా కౌన్సిలర్లు వీరంగం సృష్టించారు. తెదేపా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బల్లలు తోసేసి, అధికారుల చేతుల్లోని కాగితాలు చించేసి గలాటా సృష్టించారు. లోపలి అరుపులు విన్న వైకాపా శ్రేణులు పోలీసు బారికేడ్లు నెట్టుకుంటూ ఒక్కసారిగా పురపాలక కార్యాలయం వరకూ తోసుకురావటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పోలీసులూ గాయపడ్డారు.
ఛైర్మన్ ఎన్నిక వాయిదా
గందరగోళ పరిస్థితుల మధ్య ఛైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా (Kondapalli Municipal Chairman Election postponed)వేస్తున్నట్లు అధికారులుప్రకటించారు. వైకాపా కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోగా వాయిదా ప్రకటనను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని పట్టుబట్టారు. వైకాపా కౌన్సిలర్లు మళ్లీ కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లారు. కోరమ్ ఉన్నందున ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని లేదా వాయిదా వేస్తున్నట్లు లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ తెదేపా అభ్యర్థులు కౌన్సిల్ హాల్ లోనే బైఠాయించారు. రాత్రంతా అక్కడే ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. పోలీసులు తెలుగుదేశం నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు.
గోల్లపూడి క్యాంపుకు తెదేపా కౌన్సిలర్లు
ఈ విషయాన్ని పసిగట్టిన తెదేపా శ్రేణులు తమ కౌన్సిలర్లను అరెస్టు చేసి వైకాపా శిబిరానికి తరలిస్తారనే అనుమానంతో వ్యూహాత్మకంగా కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. గొల్లపూడిలోని క్యాంపుకు వెళ్లారు. వైకాపా తీరును కేశినేని నాని తప్పుపట్టారు. మొత్తం వ్యవహారంలో పోలీసుల మెతక వైఖరిపై విమర్శలు చెలరేగాయి. వైకాపా కౌన్సిలర్లు బల్లలు ధ్వంసం చేస్తే... మిన్నకుండిపోయారు. తెలుగుదేశం సభ్యులు, ఎంపీ కేశినేని నాని మినహా అందరినీ కౌన్సిల్ కార్యాలయానికి అరకిలోమీటరు దూరంలోనే నిలిపివేసిన పోలీసులు..వైకాపా నేతలను 100మీటర్ల దూరం వరకు అనుమతించారు.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇవాళ మళ్లీ కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. మరోమారు ఘర్షణల మధ్య వాయిదా పడుతుందా లేక సజావుగా సాగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.