మచిలీపట్నం పురపాలక సంఘానికి చెందిన దాదాపు రూ.12 కోట్ల విలువైన పనుల కేటాయింపుపై... అవకతవకల గురించి ప్రశ్నిస్తే సూటిగా సమాధానం ఇవ్వని మంత్రి పేర్ని నాని అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కోట్లాది రూపాయల పనులకు సంబంధించి టెండర్ విధానం లోపభూయిష్ఠంగా ఉందని చెప్తే జీర్ణించుకోలేని మంత్రి తనపై బురద చల్లే ప్రయత్నం చేయడం కప్పదాటు వైఖరికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి ఎక్కడికి వెళ్లినా స్పష్టంగా కనిపిస్తోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పైసా అవినీతికి ఆస్కారం లేకుండా తన పదవీ కాలం పూర్తి చేశానని రవీంద్ర వివరించారు. గిఫ్ట్ పేరుతో అవినీతికి కొత్త అర్థం చెప్పిన మంత్రి... రవాణా శాఖ ఉద్యోగుల నుంచి రూ.50 లక్షలు గిఫ్ట్‌గా తీసుకున్న విషయంపై ముఖ్యమంత్రి జగన్ వద్ద పంచాయితీ నడుస్తోన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై ఎటువంటి చర్చకైనా తాను సిద్ధమేనని సవాల్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం మానుకుని రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: