ప్రజలందరికీ నాణ్యమైన బియ్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొడాలి నాని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో అనుసంధానం చేసి పంపిణీ సులభతరం చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
వచ్చే నెల నుంచి పీడీఎస్‌లో సరఫరా చేయబోయే బియ్యం నాణ్యతపై కేంద్రం వివరాలిస్తోందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వెల్లడించారు. ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. వాటిలో 25శాతం నూకలు ఉండే అవకాశం ఉందని కేంద్రం తెలిపిందన్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో 30-40శాతం ప్రజలు తినేందుకు ఇష్టపడట్లేదన్నారు. అందుకే నాణ్యమైన బియ్యాన్ని అందజేయాడానికే ప్రయత్నిస్తామని కోన శశిధర్ పేర్కొన్నారు. ప్యాకింగ్ చేసి ఇంటింటికీ సరఫరా చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభిస్తున్నామన్నారు.
స్వర్ణ లేదా దానికి దగ్గరగా ఉండే వరి రకాలను అందిస్తామన్నారు. కొత్త ధాన్యం రానందున ఇప్పటికే సేకరించిన ధాన్యం గ్రేడింగ్ చేసి పంపిణీ చేస్తామని కోన శశిధర్ అన్నారు. సెప్టెంబర్ నుంచి 80 శాతం స్వర్ణ, 20 శాతం మిక్స్‌డ్‌గా సరఫరా చేస్తామన్నారు. ఏప్రిల్ తర్వాత స్వర్ణతో పాటు అందరు తినగలిగే బియ్యాన్ని ఇస్తామన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం నూతన విధానం తీసుకొస్తుందని ప్రకటించారు.