ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణదత్(82) చెన్నైలో కన్నుమూశారు. దత్ కేసీపీ సంస్థల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిమెంట్, చక్కెర పరిశ్రమలు, చెన్నైలో హెవీ ఇంజినీరింగ్ కర్మాగారం వీరి ఆధ్వర్యంలో ఉన్నాయి. భారత పరిశ్రమల మండలి ఫిక్కీ, ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా, వివిధ హోదాల్లో వీఎల్ దత్ బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రముఖుల విచారం...
కేసీపీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీఎల్ దత్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో దత్ చేసిన సేవలను దేశం ఎన్నటికీ మరిచిపోలేదని వ్యాఖ్యానించారు. దత్ మృతి భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. దత్ కుటుంబసభ్యులను ఉపరాష్ట్రపతి ఫోన్‌లో పరామర్శించారు.
వీఎల్ దత్ మృతి పట్ల చంద్రబాబు తీవ్ర సంతాపం తెలిపారు. వీఎల్ దత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి వీఎల్ దత్ ఎనలేని సేవ చేశారని కొనియాడారు. పల్నాడు, ఉయ్యూరులో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. సామాజిక సేవ, భాషాభివృద్ధికి వీఎల్ దత్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు వీఎల్ దత్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.
ఇదీ చదవండీ... కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి: సీఎం