ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదువుతో పాటు.. ఆహార్యంలోనూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘జగనన్న విద్యా కానుక’ కింద ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను అందించనుంది. ఈనెల 8వ తేదీ గురువారం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి కంకిపాడు మండలం పునాదిపాడు జడ్పీ పాఠశాల వేదిక కానుంది. ముఖ్యఅతిథిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనున్నారు.
నాడు - నేడు కింద రూ.61 లక్షలతో పాఠశాలలో జరిగిన పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని జగనన్న విద్యాకానుక పంపిణీ చేస్తారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను ‘సమగ్ర శిక్ష’ ఏర్పాట్లు చేస్తుంది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పరిమిత సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడకు వచ్చే వారు మాస్కులు ధరించడంతో పాటు.. సామాజిక దూరం పాటించేలా కుర్చీలు వేయిస్తున్నారు. రోడ్లు భవనాలశాఖ అధికారులు బారికేడ్లను, వైద్యఆరోగ్యశాఖ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ కార్యక్రమానికి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. మంగళవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, పాఠశాలల ముఖ్య సలహాదారుడు మురళి, సబ్ కలెక్టర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, జేసీ కె.మోహన్‌కుమార్, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, సర్వశిక్ష అభియాన్ పీవో రవీంద్ర, డీఈవో రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మొత్తం ప్రభుత్వ పాఠశాలలు: 3,105
చదువుతున్న విద్యార్థులు: 2,82,431
బాలురు: 1,35,713
బాలికలు: 1,46,718
ఇదీ చదవండి: