మన భాష, సంస్కృతి పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని, మాతృభాషలో విద్యా బోధనను ప్రోత్సహించాలని వివిధ రాష్ట్రాల తెలుగు సంఘాలు నిర్ణయించాయి. కొత్తగా ఎన్ని భాషలు నేర్చుకున్నా యువత తెలుగును విస్మరించవద్దని సూచించాయి. తెలుగు లేని రోజు తెలుగు జాతి ఉండదని, రాబోయే తరాలకు అమ్మ భాషపై అభిమానం కలిగేలా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చాయి. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ వ్యవహారిక భాషా పక్షోత్సవాలు’ ఆదివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు, విభిన్న రంగాల ప్రముఖులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. కళాకారులు, చిన్నారుల కూచిపూడి నృత్యాలు, ఏకపాత్రాభినయాలు, తెలుగుదనం ఉట్టి పడేలా సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
- అమ్మ భాషలో విద్యను ప్రోత్సహించాలి
తెలుగు మాధ్యమంలో విద్యా విధానాన్ని ప్రోత్సహించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. దాద్రానగర్ హవేలి నుంచి ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలకు మన సంస్కృతి గొప్పతనాన్ని అందించాలని పేర్కొన్నారు. తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తరంపై ఉందని పద్మశ్రీ విప్పర్తి ఆదిమూర్తి సూచించారు. తిరువనంతపురం సంస్కృతి సంఘం తరఫున ఆయన అక్కడినుంచి మాట్లాడారు. తెలుగు మాధ్యమంలో చదివే ఉన్నతస్థాయికి చేరామన్నారు. సమావేశంలో ముంబయి తెలుగు సమితి, పుణె ఆంధ్ర సంఘం, చైతన్య సాంస్కృతిక సమితి, సూరత్ తెలుగు మిత్రులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ప్రసంగించారు. సినీ గేయ రచయితలు భువనచంద్ర, వెన్నెలకంటి పాల్గొన్నారు.
ఇదీ చూడండి. వరవరరావు కోసం లేఖ రాస్తే దేశ బహిష్కారం కోరతారా?: భూమన