పారం-7 ద్వారా ఓటు తొలగింపునకు దరఖాస్తు అందిన తర్వాత... 7 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. బూత్ లెవల్ ఆధికారి క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తుదారులు... వారి సంబంధీకులను విచారించి తహసీల్దార్‌కు నివేదించాలి. ఆయన నియోజకవర్గ ఎన్నికల ఆధికారికి, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌కు, తదుపరి సీఈవోకు నివేదించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల పరిశీలనకు వెళ్తే క్షేత్రస్థాయిలో చాలా వరకు తప్పుడువేనని తేలుతున్నాయి. తమ ప్రమేయం లేకుండానే ఎవరో తమ ఓట్లు తొలగించాలని చూస్తున్నట్లు ఓటర్లు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో తప్పుగా తేలితే కంప్యూటర్ ఐపీ చిరునామా అధారంగా దరఖాస్తుదారుని గుర్తిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి, విజయవాడ నగర కమిషనర్ తిరుమలరావు... తప్పుడు దరఖాస్తుల చేసిన వారిపై చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టారు.
తప్పుడు దరఖాస్తు చేసిన 25 మందిపై కేసు నమోదు చేశారు. ఇంకా 40వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కొన్నింటిని తిరస్కరించగా... మరికొన్ని పరిశీలిస్తున్నారు. దురుద్దేశంతో ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసినవారిని వదిలబోమని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఇంతియాజ్ స్పష్టం చేశారు.
మచిలీపట్నంలో 3, అవనిగడ్డలో 3, పెనమలూరులో 1... సహా పలు నియోజకవర్గాల్లో మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. జగ్గయ్యపేటలో ఒక వ్యక్తి 37 మంది ఓటర్ల పేర్లను తొలగించాలని దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. కలెక్టర్ ఇంతియాజ్ స్వయంగా ఆ వ్యక్తిని కలిస్తే... ఆయన రైతుకూలీగా తేలింది. ఏ మాత్రం కంప్యూటర్ పరిజ్ఞానం లేని వ్యక్తి కావడంతో... దీనిపై డీఎస్పీతో చర్చించి కేసులు పెట్టాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం విధులకు అంతరాయం, ఆటంకం కల్పించే సెక్షన్లతో పాటు... ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అన్యాయంగా ఎవరి ఓటు తొలగించమని... ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. చరవాణి ద్వారా 1950కు సందేశం పంపి ఓటు వివరాలు తెలుసుకోవాలని అవగాహనకల్పిస్తున్నారు.